Share News

సిద్దిపేట జిల్లాలో పిచ్చి కుక్క వీరంగం.. 13 మందికి తీవ్ర గాయాలు..

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:43 PM

సిద్దిపేట శివారు పొన్నాలలో గణేశ్ నిమజ్జనంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఒక్కసారిగా విరుచుకుపడి మొత్తం 13 మందిని తీవ్రంగా గాయపరిచింది.

సిద్దిపేట జిల్లాలో పిచ్చి కుక్క వీరంగం.. 13 మందికి తీవ్ర గాయాలు..
Dog Attack

సిద్దిపేట జిల్లా: సిద్దిపేట శివారు పొన్నాలలో గణేశ్ నిమజ్జనంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఒక్కసారిగా విరుచుకుపడి మొత్తం 13 మందిని తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామస్థులంతా ఆనందోత్సాహాల మధ్య వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.


ఇదే సమయంలో ఓ పిచ్చికుక్క వారి వద్దకు వచ్చింది. డ్యాన్సులు చేస్తున్న వారిని చూస్తున్న స్థానికులపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. 8 మందిని తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం మరోచోట వినాయక మండపాల వద్ద ఆడుకుంటున్న చిన్నారులపై దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కనకవ్వ అనే మహిళను వెంటాడి మరీ కరిచింది. శునకం దాడిలో మొత్తం 13 మంది గాయపడగా.. బాధితులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


బాధితుల్లో 8 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్న వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ఐదుగురికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. కుక్క దాడిలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వినాయక నిమజ్జన వేడుకల వేళ పిచ్చి కుక్క దాడి పొన్నాలలో కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.39 లక్షలకు ప్రణీత్ రెడ్డి సొంతం

Updated Date - Sep 25 , 2026 | 01:08 PM