Share News

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

ABN , Publish Date - Sep 25 , 2026 | 08:55 AM

హైదరాబాద్‌‌లోని ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించే లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..
Khairatabad Ganesh Laddu Speciality

హైదరాబాద్‌: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించే లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో గణేశుడి లడ్డూలకు వేలం నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఖైరతాబాద్ గణేశుడి లడ్డూను మాత్రం ఎలాంటి వేలం పాట లేకుండా భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రత్యేకతగా నిలుస్తోంది.


తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి భారీ లడ్డూను ప్రసాదంగా సమర్పిస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని తాపేశ్వరంలోని శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ యూనిట్స్‌ యజమాని పి.వి.వి.ఎస్.మల్లికార్జున రావు 2010లో ప్రారంభించారు. అప్పట్లో 500 కిలోల లడ్డూను సమర్పించగా.. నాటి నుంచి ప్రతి ఏడాది వివిధ పరిమాణాల్లో లడ్డూలను అందిస్తున్నారు. ఈ ఏడాది సుమారు 50 కిలోల బరువున్న లడ్డూను ఖైరతాబాద్ గణేశుడికి సమర్పించారు. ఈ లడ్డూ తయారీ ప్రత్యేక పద్ధతిలో సాగుతుంది. తాపేశ్వరంలోని సురుచి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో దీనిని తయారు చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యితో ఎలాంటి కృత్రిమ పదార్థాలు ఉపయోగించకుండా రూపొందిస్తారు. లడ్డూ తయారీలో పాల్గొనే కళాకారులు గణపతి దీక్ష పాటిస్తూ ప్రత్యేక వస్త్రధారణతో ఉంటారు.


ఈ ఏడాదీ గణేశుడి నిమజ్జనం అనంతరం లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. ఈ సంప్రదాయమే ఖైరతాబాద్ గణేశుడి లడ్డూకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. మరోవైపు, ఈ ప్రసాదం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. లడ్డూతో పాటు.. మహా గణపతికి మెడలో వేసిన రుద్రాక్ష మాలలోని రుద్రాక్షలనూ భక్తులకు పంపిణీ చేయనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆలస్యంగా ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

నేటి రాశి ఫలాలు... 25-09-026

Updated Date - Sep 25 , 2026 | 09:23 AM