ఆసియా రికార్డు బద్దలు.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:28 AM
ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్-సురుచి జోడీ పసిడి నెగ్గింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ విభాగంలోనూ భారత్‌కు రజతం దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత షూటర్లు సత్తా చాటారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కమల్‌జీత్-సురుచి జోడీ పసిడి నెగ్గింది. తుది పోరులో 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఈ జోడీ.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణాన్ని చేర్చింది. ఈ క్రమంలో ఆసియా రికార్డును బద్దలు కొట్టిన ఈ జోడీ.. ప్రపంచ రికార్డుకు కేవలం 3.8 పాయింట్ల దూరంలో నిలవడం విశేషం.
ఫైనల్లో ఆరంభం నుంచే కమల్‌జీత్-సురుచి ఆధిపత్యం ప్రదర్శించారు. వీరికి కొరియా నుంచి గట్టి పోటీ ఎదురైనా.. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. చివరికి 6.6 పాయింట్ల తేడాతో గెలుపొంది పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. తుది ఫలితాల్లో భారత్ 484.6 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. కొరియా 478 పాయింట్లతో రజతం సాధించింది. ఇరాన్ 415.8 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది.
50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్‌లోనూ..
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3-పొజిషన్ విభాగంలోనూ భారత్‌కు మరో పతకం దక్కింది. అర్హత పోటీల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 589, నీరజ్ కుమార్ 588, రుద్రాంక్ష్ పాటిల్ 585 పాయింట్లు సాధించారు. దీంతో భారత్ 1762 పాయింట్లు నమోదు చేసి జట్టు సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఈ విభాగంలో చైనా 1766 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ ఎగరేసుకుపోగా.. దక్షిణ కొరియా మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.
ఇక.. అర్హత పోరులో భారత బృందంలో రుద్రాంక్ష్ పాటిల్ మూడో స్థానంలో నిలవడంతో వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. నిబంధనల ప్రకారం.. ఒక్కో దేశం నుంచి ఇద్దరు షూటర్లకే వ్యక్తిగత ఫైనల్లో అవకాశం ఉంటుంది. దీంతో భారత్ తరఫున ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్ మాత్రమే తుదిపోరులో బరిలోకి దిగనున్నారు.
ఇవీ చదవండి: