Share News

కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!

ABN , Publish Date - Sep 25 , 2026 | 10:22 AM

ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్‌నాథ్‌లో పర్యాటకుల రద్దీతో రోజురోజుకూ చెత్తాచెదారం ఎక్కువైపోతోంది. ఈ ఏడాది 15 లక్షల మంది యాత్రికులు కేదర్‌నాథ్‌ను సందర్శించగా.. 50 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి.

కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!
Kedarnath

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్‌నాథ్‌లో పర్యాటకుల రద్దీతో రోజురోజుకూ చెత్తాచెదారం ఎక్కువైపోతోంది. యాత్రికుల రద్దీ ప్రభావం కారణంగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల్లోనే సుమారు 50.30 మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయింది. గత మూడేళ్లలో ఎన్నడూలేని విధంగా ఇంత భారీగా వ్యర్థాలు పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన అమిత్‌ గుప్తా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద కోరిన వివరాల మేరకు కేదార్‌నాథ్‌ నగర్‌ పంచాయతీ కార్యాలయం ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గణాంకాల ప్రకారం.. కేదార్‌నాథ్‌లో 2023లో 32.58 టన్నులు, 2024లో 26.10 టన్నులు, 2025లో 21.40 టన్నుల వ్యర్థాలు నమోదయ్యాయి. అయితే.. ఈ ఏడాది ఏప్రిల్‌-ఆగస్టు నెలల్లోనే అది 50.30 టన్నులకు చేరింది. ఈ పరిమాణం 2023 ఏడాది మొత్తంతో పోలిస్తే సుమారుగా 54 శాతం ఎక్కువ కాగా.. 2024తో పోలిస్తే 93 శాతం, 2025తో పోలిస్తే ఏకంగా 135 శాతం అధికం కావడం గమనార్హం.


ఈ ఏడాది నెలల వారీగా చూస్తే.. ఏప్రిల్‌లో 1.7 టన్నుల వ్యర్థాలు నమోదువ్వగా.. మే నెలలో యాత్రికుల రద్దీ పెరగడంతో అది ఒక్కసారిగా 16.3 టన్నులకు చేరింది. జూన్‌లో 11.5 టన్నులు, జూలైలో 10.5 టన్నులు, ఆగస్టులో 10.3 టన్నుల చెత్త పేరుకుపోయింది. ఈ వ్యర్థాల ద్వారా ఇప్పటివరకు సుమారు 20 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వెలువడినట్లు తెలుస్తోంది. ఇందులో 18.5 టన్నులు(సుమారు 92.5 శాతం) ప్రాసెస్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 1.5 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు అలాగే ఉన్నాయని చెప్పారు.


కేదార్‌నాథ్‌లో చెత్త నిర్వహణ కోసం 30 వేల చదరపు అడుగుల ల్యాండ్‌ఫిల్‌ సామర్థ్యం ఉన్నట్లు అక్కడి పంచాయతీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం.. అందులో 28 వేల చదరపు అడుగుల స్థలం మిగిలుందని పేర్కొంది. ఐదేళ్ల కాలంలో అక్కడ 4 ల్యాండ్‌ఫిల్స్‌ నిర్మించినట్లు తెలిపింది. ఇక యాత్రికుల విషయానికొస్తే.. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించినట్లు సమాచారం. ఏటా యాత్రికులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వ్యర్థాల పరిమాణం కూడా గణనీయంగా పెరుగుతోంది.


ఇవీ చదవండి:

బాలాపూర్ లడ్డూ వేలం నేడే.. ఈసారి ఎంత పలుకుతుందో.?

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సజ్జనార్

Updated Date - Sep 25 , 2026 | 10:56 AM