బాలాపూర్ లడ్డూ వేలం నేడే.. ఈసారి ఎంత పలుకుతుందో.?
ABN , Publish Date - Sep 25 , 2026 | 08:59 AM
భాగ్యనగరంలో బాలాపూర్ గణేశ్ చివరి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. నేడు అక్కడి లడ్డూకు వేలం నిర్వహించనున్నారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం రూ.450తో మొదలైన వేలం.. గతేడాది రూ.35 లక్షలకు చేరింది. మరి ఈ సారి ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. అక్కడి గణేశుడి చేతిలో ఉండే 21 కిలోల లడ్డూ వేలం పాట.. ఏటా ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ లడ్డూను సొంతం చేసుకుంటే.. సుఖసంతోషాలతో పాటు సిరిసంపదలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున పోటీ పడుతుంటారు. అందుకే ఈ సారి లడ్డూ వేలం పాట కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలాపూర్ లడ్డూకు ఘనమైన చరిత్ర ఉంది. 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.. ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. అలా 2002లో తొలిసారిగా రూ.1.05 లక్షలు దాటింది. ఆ తర్వాత 2015లో రూ.10.32 లక్షల మార్క్‌నూ చేరుకుంది. 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికింది. కరోనా కారణంగా 2020లో వేలం నిర్వహించలేదు. దీంతో లడ్డూను నాటి సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 2021లో రూ.18.90 లక్షలు పలికిన లడ్డూ.. 2022లో రూ.24.60 లక్షలు, 2023లో రూ.27 లక్షలకు ఎగబాకింది. ఇక.. 2024లో రికార్డు స్థాయిలో రూ.30.01 లక్షలకు చేరింది. గతేడాది మరో సరికొత్త రికార్డుతో రూ.35 లక్షలు పలకడం విశేషం. ఈ ఏడాది మరో రూ.1-2 లక్షలు పెరిగే అవకాశం ఉన్నట్టు బాలాపూర్ ఉత్సవ సమితి అంచనా వేస్తోంది.
వేలం సొమ్ముతో ఏం చేస్తారంటే?
కాగా.. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉత్సవ సమితి.. స్థానిక పనులు, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి వాటికి ఉపయోగిస్తుంది. బాలాపూర్‌లోని పలు ఆలయాల అభివృద్ధి సహా హైస్కూల్‌లో షెడ్డు, గణేశ్ చౌక్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే.. వినాయక మండపానికి ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు.
లడ్డూను పంటపొలాల్లో.!
ఇక.. వేలం ద్వారా దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తమ కుటుంబ సభ్యులు, బంధువులు సహా ఇతరులకూ పంచిపెడతారు. కొందరైతే పంటలు బాగా పండట సహా ఆయురారోగ్యాలు కలగాలని లడ్డూను పొడిచేసి వ్యవసాయ పొలాల్లోనూ చల్లుతుంటారని సమాచారం. మరికొందరు కొంత లడ్డూను తమ ఇళ్లలో లేదా వ్యాపార సంస్థలలో ప్రత్యేకంగా దాచుకుంటారని తెలుస్తోంది. ఫలితంగా వారి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుందని నమ్మతుంటారు.
ఇవీ చదవండి:
ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ
నిమజ్జనానికి బాలాపూర్ గణపతి సిద్ధం