Share News

నిమజ్జనానికి బాలాపూర్‌ గణపతి సిద్ధం

ABN , Publish Date - Sep 25 , 2026 | 08:11 AM

నిమజ్జనోత్సవానికి బాలాపూర్‌ గణేశుడు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించే 32వ వేలం పాటలో ఈ సారి గణేశ్‌ లడ్డూ ఎవరికి సొంతం కానుందోనన్న ఉత్కంఠ మరికొన్ని గంటల్లో తేలనుంది.

నిమజ్జనానికి బాలాపూర్‌ గణపతి సిద్ధం
Balapur Ganesh

  • ఉదయం ఐదు గంటల నుంచే ఊరేగింపు

  • లడ్డూ వేలంపై సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్: నిమజ్జనోత్సవానికి బాలాపూర్‌ గణేశుడు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించే 32వ వేలం పాటలో ఈ సారి గణేశ్‌ లడ్డూ ఎవరికి సొంతం కానుందోనన్న ఉత్కంఠ మరికొన్ని గంటల్లో తేలనుంది. ప్రతి ఏటా వేలం పాటలో అంతకంతకు ధర రెట్టింపవుతూ వచ్చింది. గత ఏడాది రూ.35లక్షలకు రికార్డుస్థాయి ధరకు వేలం పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది జరుగనున్న వేలం పాటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి వేలంపాటలో పాల్గొనే బాలాపూర్‌ గ్రామస్థులు కూడా ముందస్తుగా డబ్బు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందనే కొత్త నిబంధనలను నిర్వాహకులు తీసుకువచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో చివరగా గురువారం సాయంత్రం ఆరు గంటలలోపు డిపాజిట్‌ చెల్లించిన వారికే వేలం పాటలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు.


ఏడు లక్షలకుపైగా భక్తుల సందర్శన..

గత పది రోజులుగా రోజూ బాలాపూర్‌ గణపతిని యాభై వేల మంది వరకు దర్శించుకున్నారు. సెలవుదినాల్లో మాత్రం ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా భక్తులు బాలాపూర్‌ గణపతిని దర్శించుకున్నారని తెలిపారు.


city3.2.jpg10గంటలకు వేలం పాట

బాలాపూర్‌ గణపతి నిమజ్జన వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తెల్లవారుజామున ఐదు గంటలకు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి బాలాపూర్‌ పురవీధుల్లో భజనలు చేస్తూ గణపతిని ఊరేగిస్తారు. బాలాపూర్‌ తొమ్మిది గంటలకు గణనాథుడు బొడ్రాయి వద్దకు చేరుకుంటారు. ఉదయం పది గంటలకు లడ్డూ వేలం పాటను ప్రారంభిస్తారు. గత ఏడాది వేలం పాటలో లడ్డూను సొంతం చేసుకున్న దాసరి దయానంద్‌రెడ్డిని ఈ సందర్భంగా బంగారు గొలుసుతో ఘనంగా సత్కరించనున్నారు.


భారీ పోలీసు బందోబస్తు

శుక్రవారం జరగనున్న బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జన శోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు శంషాబాద్‌ డీసీపీ రాజేష్‌ తెలిపారు. శోభాయాత్ర వెంట ఒక డీసీపీ, ఒక అడిషనల్‌ డీసీపీ, నలుగురు ఏసీపీలు, 12మంది సీఐలు, 26మంది ఎస్‌ఐలు, 208 మంది పోలీసు సిబ్బందితో పాటు రాపిడ్యాక్షన్‌ ఫోర్స్‌తో పాటు పారామిలటరీ బలగాలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారన్నారు. సీసీ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తామని డీసీపీ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిమజ్జనం ఎందుకు?

ఫాంహౌస్‌ పక్కనే భూమి.

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 08:11 AM