Share News

హ్యాపీగా.. జాలీగా..!

ABN , Publish Date - Sep 25 , 2026 | 07:35 AM

హైదరాబాద్‌ నగర పర్యాటకం త్వరలో కొత్త పుంతలు తొక్కనుంది.

హ్యాపీగా.. జాలీగా..!
Hyderabad Tourism

  • మళ్లీ ఆకట్టుకోనున్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు

  • 27 నుంచి అందుబాటులోకి!

  • మరోవైపు 2 ఓపెన్‌టాప్ బస్సుల కోసం పర్యాటక శాఖ టెండర్లు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగర పర్యాటకం త్వరలో కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటివరకు సొంత వాహనాలు, ఆటోలు, క్యాబ్‌ల్లో సిటీ టూరిజాన్ని తిలకించిన సందర్శకులు మరికొద్ది రోజుల్లో పర్యాటకశాఖ బస్సుల్లో పర్యటించే అవకాశం లభించనుంది. ఈ మేరకు తెలంగాణ టూరిజం డెవలప్‏మెంట్‌ కార్పొరేషన్‌ ఓపెన్‌టాప్ బస్సులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.


- రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం పర్యాటకానికి పెట్టింది పేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. నిజాం రాజుల పాలనలో ఇక్కడ నిర్మితమైన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్‌, గోల్కొండ ప్రదేశాల తోపాటు ఆహ్లాదకరమైన పార్కులు, ఆధ్యాత్మిక ఆలయాలు, స్థలాలు, హుస్సేన్‌సాగర్‌ బోటింగ్‌ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంటాయి. అయితే ఆయా ప్రదేశాలకు ఒకే వాహనంలో వెళ్లి వచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది కొన్ని చోట్లకే వెళ్తున్నారు.


గతంలో హాప్‌ ఆన్‌-హా్‌ప ఆఫ్‌ బస్సులు

రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015 మే 31న పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా హాప్‌ ఆన్‌-హా్‌ప ఆఫ్‌ బస్సులను ప్రారంభించారు. 18, 26 సీట్లతో కూడిన 6 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రతి పది నిమిషాలకోసారి బస్సు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రారంభం నుంచి దాదాపు ఏడాదిపాటు రద్దీతో నడిచిన బస్సులు తర్వాత క్రమంలో సందడి తగ్గింది. బస్సుల నిర్వహణ భారంగా మారడంతో టూరిజం కార్పొరేషన్‌ వాటిని నిలిపివేసింది. దీంతో అప్పటి నుంచి ప్రైవేట్‌ వాహనాల ద్వారానే చాలామంది పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.


సరికొత్తగా ఓపెన్‌టాప్ బస్సులు

హైదరాబాద్‌ సిటీ టూరిజంలో ఎన్నడూ లేని విధంగా ఓపెన్‌టాప్ బస్సులను తీసుకొస్తున్నారు. పర్యాటకుల సందర్శనను మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు డబుల్‌ డెక్కర్‌ ఓపెన్‌టాప్ హాప్‌ ఆన్‌- హాప్‌ ఆఫ్‌ బస్సుల నిర్వహణకు సంబంధించి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‏పీ)ని కార్పొరేషన్‌ ఇటీవల పిలిచింది. ఈ టెండర్లు/బిడ్లు సమర్పించేందుకు ఆర్‌ఎఫ్‏పీ గురువారం ముగిసింది. సుమారు రూ.2.50 కోట్లతో 2 ఓపెన్‌టాప్ బస్సులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. \


ఇందులో అప్ప ర్‌డెక్‌ (పైభాగం) ఓపెన్‌టాప్ తో ఉండగా.. లోయర్‌ డెక్‌ అద్దాలతో ఏసీతో ఉండనుంది. కాగా, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా గైడ్‌, మైక్రోఫోన్‌ సిస్టమ్‌, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, మొబైల్‌ ఛార్జీంగ్‌ పాయింట్లు, ఎల్‌ఈడీ లైటింగ్‌, సీసీ టీవీ కెమెరాలు ఉండనున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో రాత్రిపూట నగర అందాలను తిలకించేందుకు చర్యలు తీసుకుంటుంది. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్ రోడ్డు, గోల్కొండ కోట, హైటెక్‌సిటీ, సైబర్‌టవర్స్‌, దుర్గం చెరువు, కేబీఆర్‌ పార్కు లాంటి ప్రాంతాలను చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


సెప్టెంబర్‌ 27 నుంచి 6 బస్సులు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27 నుంచి హెచ్‌ఎండీఏకు చెందిన 6 డబుల్‌ డెక్కర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటికే హెచ్‌ఎండీఏ, కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వరల్డ్‌ టూరిజం డే రోజున బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చి పర్యాటకులను అలరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిమజ్జనం ఎందుకు?

ఫాంహౌస్‌ పక్కనే భూమి.

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 07:35 AM