నీట్ పీజీ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:44 AM
దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఆర్‌ఎన్‌బీ, పీజీ డిప్లొమా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్-పీజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సె్‌స(ఎన్‌బీఈఎంఎస్) విడుదల చేసింది.
641 మార్కులు సాధించిన అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్
జనరల్, ఈడబ్ల్యూఎస్ కటాఫ్ 262 మార్కులు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఆర్‌ఎన్‌బీ, పీజీ డిప్లొమా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్-పీజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సె్‌స(ఎన్‌బీఈఎంఎస్) విడుదల చేసింది. మొత్తం 720 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోర్లు, ఆలిండియా ర్యాంకుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశ వ్యాప్తంగా ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,63,544 మంది హాజరు కాగా, జైపూర్‌లోని సీతాపుర పరీక్ష కేంద్రంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పరీక్ష పూర్తిచేయలేకపోయిన అభ్యర్థులకు ఈ నెల 5న రీ-ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పునఃపరీక్షకు 2,416 మంది హాజరయ్యారు. కాగా, ఈ ఏడాది ఫలితాల్లో రోల్ నంబర్ 26661005596 కలిగిన అభ్యర్థి 641 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఫలితాలతోపాటే వివిధ కేటగిరీల అర్హత కటాఫ్ మార్కులను బోర్డు ఖరారు చేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 50 పర్సంటైల్‌ను అర్హతగా నిర్ణయించగా 262 మార్కులు, జనరల్-దివ్యాంగుల(పీడబ్ల్యూబీడీ) కేటగిరీకి 45 పర్సంటైల్‌తో 244 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ/బీసీ(రిజర్వ్‌డ్ దివ్యాంగులతో కలిపి) కేటగిరీలకు 40 పర్సంటైల్‌తో 226 మార్కులను కటా్‌ఫగా నిర్ధారించారు. నెగెటివ్ మార్కుల విధానం అమలులో ఉండటంతో దేశవ్యాప్తంగా చివరి ర్యాంకు 2,65,934 వద్ద ముగియగా, అతి తక్కువ స్కోరు మైనస్ 19(-19) మార్కులుగా నమోదైంది. బోర్డు విడుదల చేసిన మెరిట్ జాబితాలో అభ్యర్థుల పేర్లు, రాష్ట్రాల కేటాయింపులు లేకుండా కేవలం రోల్ నంబర్ల క్రమంలో ఆలిండియా ర్యాంకులను మాత్రమే పొందుపరిచారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత స్కోర్ కార్డులను అక్టోబరు 1 నుంచి ఎన్‌బీఈఎంఎస్ అధికారిక పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.