నిమజ్జనం ఎందుకు?
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:26 AM
గణపతి ఉత్సవాలు మనలోని పవిత్రతను, వివేకాన్ని, విచక్షణను మేల్కొలపడానికి ఉద్దేశించిన ఆధ్యాత్మిక వేడుకలు. మట్టితో గణేశుని ప్రతిమను తయారు చేసి,,..
సహజయోగ
గణపతి ఉత్సవాలు మనలోని పవిత్రతను, వివేకాన్ని, విచక్షణను మేల్కొలపడానికి ఉద్దేశించిన ఆధ్యాత్మిక వేడుకలు. మట్టితో గణేశుని ప్రతిమను తయారు చేసి, ప్రాణప్రతిష్ఠ చేసి, పదిరోజుల పాటు పూజలు నిర్వహిస్తాం. అనంతరం అనంత చతుర్దశి నాడు ఆ ప్రతిమను నీటిలో నిమజ్జనం చేస్తాం. బయటకు చూస్తే ఇది ఒక ఆచారంలా కనిపిస్తుంది. కానీ దాని వెనుక ప్రకృతికీ, దైవశక్తికి, మానవ చైతన్యానికి సంబంధించిన గొప్ప సందేశం దాగి ఉంది.
అనంతం అంటే ‘నాశనం లేనిది’, ‘సర్వత్రా వ్యాపించి ఉన్నది’ అని అర్థం. గణేశుడు అనంతుడు. ఆయన అనంతమైన దైవశక్తికి ప్రతీక. పూజల ద్వారా గణేశ ప్రతిమలో మనం ఆవాహన చేసుకున్న పవిత్రమైన చైతన్యం... నిమజ్జనం ద్వారా తిరిగి ప్రకృతిలో ఐక్యమవుతుందని శ్రీమాతాజీ నిర్మలాదేవి చెప్పారు. నీరు ప్రవాహశీలతకు ప్రతీక. అది ఒక చోట నిలిచిపోదు. అది ప్రవహిస్తూ తనతో పాటు అన్నిటినీ తీసుకువెళ్తుంది. కాబట్టి గణేశ నిమజ్జనం అంటే ప్రతిమను నీట కలపడం మాత్రమే కాదు. గణేశతత్త్వాన్ని సర్వత్రా వ్యాపింపజేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. గణేశుడు పవిత్రతకు సంకేతం. ఆయనలోని వివేకం, విచక్షణ, నిర్మలత్వం, నిరాడంబరత మనిషికి మార్గదర్శకాలు. అహంకారాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన దైవ శక్తికి మనల్ని మనం సమర్పించుకోవడం, తల్లిపట్ల గౌరవం, సమర్పణా భావాన్ని కలిగి ఉండడం, తప్పొప్పులను గుర్తించే విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకోవడం గణేశ తత్త్వంలోని ముఖ్యమైన అంశాలు. కాబట్టి గణేశుని ఆరాధనను కోరికలు తీర్చుకోవడానికి చేసే పూజగానే పరిమితం చేయకూడదు. పవిత్రత, వివేకం, అమాయకత్వం, విచక్షణ లాంటి ఆయనలోని గుణాలను మనలో పెంపొందించుకోవడమే నిజమైన గణేశ ఆరాధన.
ప్రకృతి నుంచి ప్రకృతిలోకి
మన సంస్కృతిలో ప్రకృతిని దైవ స్వరూపంగా దర్శించే గొప్ప సంప్రదాయం ఉంది. మట్టి నుంచి గణేశుడి రూపాన్ని సృష్టిస్తాం. ఆ రూపంలో దైవభావాన్ని ఆవాహన చేసి పూజిస్తాం. అనంతరం ఆ మూర్తిని నీటిలో నిమజ్జనం చేస్తాం. ఇది ‘ప్రకృతి నుంచి ఉద్భవించి, తిరిగి ప్రకృతిలోనే ఐక్యమవడం’ అనే శాశ్వత సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. మట్టితో రూపొందిన రూపం నీటిలో కలిసిపోతుంది. అయితే ఈ ఆరాధన ద్వారా మనలో మేలుకొన్న గణేశతత్త్వం మన జీవనంలో కొనసాగాలి. గణేశ నిమజ్జనాన్ని చాలామంది వీడ్కోలుగా భావిస్తారు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో అది వీడ్కోలు కాదు... అనంతంలో ఐక్యం కావడం. పదిరోజుల పాటు మన ఇంట్లో, మన హృదయంలో, మన సమాజంలో కొలువైన గణేశుడు తిరిగి విశ్వవ్యాప్తమైన ప్రకృతి తత్త్వంలో ఐక్యం అవుతున్నాడు. అందుకే భక్తితో, ఆనందంతో, కృతజ్ఞతతో నిమజ్జనం చేయాలి. మేళతాళాలతో, గణేశ కీర్తనలతో, మంగళప్రదమైన నామస్మరణతో గణేశుణ్ణి సాగనంపడం మన సంప్రదాయంలో భాగం.
అప్పుడే సార్థకత
అయితే ఈ ఆధ్యాత్మిక భావనను కేవలం పది రోజులకు మాత్రమే మనం పరిమితం చేసుకోకూడదు. మన ఆలోచనల్లో పవిత్రత రావాలి. మన నిర్ణయాల్లో వివేకం ఉండాలి. మన ప్రవర్తనలో విచక్షణ ఉండాలి. మన హృదయంలో పెద్దల పట్ల గౌరవం ఉండాలి. మనలో అహంకారం తగ్గి, సమర్పణ భావం పెరగాలి. అప్పుడే గణేశపూజ సార్థకం అవుతుంది. గణేశ ప్రతిమను నిమజ్జనం చేస్తున్నప్పుడు... మనలోని అహంకారాన్ని, అవివేకాన్ని, ప్రతికూలతలను కూడా ఆ జలాల్లో వదిలిపెట్టాలి. నిర్మలంగా, ప్రశాంతంగా, వివేకంతో బయటకు రావాలి. ‘రూపం తాత్కాలికం. తత్త్వం శాశ్వతం, ప్రతిమ పరిమితం, గణేశ శక్తి అనంతం’ అని గుర్తుంచుకోవాలి. నిమజ్జనం ఒక ముగింపు కాదు. మట్టితో రూపొందిన గణేశ రూపం నీటిలో కలిసిపోయినా... ఆయన తత్త్వం మనలో నిలచిపోవాలి. గణేశుని పవిత్రత మనలో మేలుకొనాలి. ఆయన వివేకం మన ఆలోచనలకు దిశానిర్దేశం చేయాలి. ఆయన ఆశీస్సులతో మన జీవితం అనంత చైతన్యంతో అనుసంధానం కావాలి.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ
నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్