ఫాంహౌస్ పక్కనే భూమి.
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:37 AM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ పక్కనే ఉన్న భూములు అవి.. ఇందిరాగాంధీ హయాం నుంచి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం వరకు వివిధ పథకాల కింద సర్వే నంబర్ 325 పరిధిలో సుమారు 388.05 ఎకరాలను 244 మంది దళిత, పేద రైతులకు కేటాయించారు (అసైన్ చేశారు)..
ఆన్‌లైన్‌లోకి ఎక్కలేదేమి?
ధరణిలో నమోదుచేయని గత ప్రభుత్వం
రైతుబంధు, బీమా, రుణమాఫీ తదితర ప్రభుత్వ పథకాలు అందని దుస్థితి
అందులో 40 మంది రైతుల నుంచి
52 ఎకరాలు తీసుకుని
పాండురంగ రిజర్వాయర్ నిర్మాణం ప్రత్యామ్నాయ భూమి హామీ గాలికి!
ఎర్రవల్లి భూముల సర్వేలో
తేలుతున్న రైతుల గాథలు
సంగారెడ్డి/గజ్వేల్/మర్కూక్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ పక్కనే ఉన్న భూములు అవి.. ఇందిరాగాంధీ హయాం నుంచి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం వరకు వివిధ పథకాల కింద సర్వే నంబర్ 325 పరిధిలో సుమారు 388.05 ఎకరాలను 244 మంది దళిత, పేద రైతులకు కేటాయించారు (అసైన్ చేశారు).. దీనికి సంబంధించి రైతుల వద్ద పాస్‌బుక్‌లు ఉన్నాయి.. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు కూడా.. అయితే రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నీ ఆన్‌లైన్ చేయడానికంటూ ధరణి పోర్టల్‌ను తెచ్చిన గత ప్రభుత్వం.. ఫామ్‌హౌ్‌సకు ఎగువనే ఉన్న ఈ భూములను మాత్రం అందులో నమోదు చేయలేదు. దానితో ఈ భూములను సాగు చేసుకుంటున్న దళిత, పేద రైతులు.. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటివి పథకాలను పొందలేకపోయారు. ఈ క్రమంలో తమ భూములను ధరణిలో నమోదు చేయించాలని వారు పలుమార్లు అప్పటి సీఎంను కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇక ఫామ్‌హౌజ్ పక్కన నిర్మించిన పాండురంగ రిజర్వాయర్, దానితో భూములు కోల్పోయిన రైతులది మరో వ్యథ. తమకు ప్రత్యామ్నాయంగా భూమిని ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటికీ భూమి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. బాధిత రైతులు ఇప్పటికీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తమ గ్రామ పరిధిలో ఉండాల్సిన 135 ఎకరాల భూములు మాయమయ్యాయని, వాటిని ఎర్రవల్లి పరిధిలోని 325 సర్వేనంబరులో కలిపేశారంటూ పక్కనే ఉన్న శివారు వెంకటాపూర్ గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భూముల సర్వే సందర్భంగా అక్కడి రైతుల గాథలు క్రమంగా తెరమీదకు వస్తున్నాయి. కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లికి చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ.. ‘ఆనాడు సారు పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’ అని పేర్కొంటుండటం గమనార్హం.
ధరణిలో ఎందుకు నమోదు చేయలేదు?
కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కనే 325 సర్వే నంబరులో 388.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ పట్టాలు, ఆ తర్వాత ఎన్‌టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కొందరికి, మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో మరికొందరికి ఇక్కడ అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. 244 మంది రైతులకు ఒక్కొక్కరికి అర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఇక్కడ భూమి ఉంది. ఏళ్లుగా వాటిని సాగు చేసుకుంటున్నారు. అయితే భూములకు సంబంధించి ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన ప్రభుత్వం 325 సర్వే నంబర్ పరిధిలోని రైతుల అసైన్డ్ భూములను అందులో నమోదు చేయలేదు. ఎన్నిసార్లు ఈ విషయాన్ని నాటి ప్రభుత్వం, సీఎందృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని దళిత, పేద రైతులు వాపోతున్నారు. తమ భూములను ఆన్‌లైన్ చేయకపోవడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదని అంటున్నారు.
భూగర్భజలాల పేరిట పాండురంగ సాగర్‌తో..
సర్వే నంబరు 325 పరిధిలో నాలుగు ఎకరాల్లో కుమ్మరోనికుంట ఉండేది. అయితే ఫామ్‌హౌజ్ పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని, నీటిని నిల్వ చేసుకోవచ్చంటూ కేసీఆర్ ప్రభుత్వం.. 2016లో కుంటను విస్తరించి పాండురంగ రిజర్వాయర్‌ను నిర్మించింది. 40 మంది రైతులు సాగుచేసుకుంటున్న 52 ఎకరాల అసైన్డ్ భూమితోపాటు మరో 25 ఎకరాల పట్టా భూమి కలిపి 77 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మించారు. పట్టాభూమి ఉన్నవారికి అప్పట్లోనే పరిహారం ఇచ్చారు. అసైన్డ్ భూమిని కోల్పోయిన 40 మంది రైతులకు భూమికి బదులుగా భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఆ హామీని పట్టించుకోలేదని బాధిత రైతులు వాపోతున్నారు. నేటికీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గురువారం కూడా పాండురంగ రిజర్వాయర్ నిర్వాసిత రైతులు మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలోనే పడిగాపులు పడుతూ కనిపించడం గమనార్హం.
ఆ రైతుల పట్టాలనూ పరిశీలించాక స్పష్టత
ఈ 388 ఎకరాల్లో 30 ఎకరాల్లో కోనమ్మ చెరువు, మరో 20 ఎకరాల్లో కాలువలు, రహదారులు ఉంటాయి. మరో 20 ఎకరాల్లో చెరువు మత్తడి, పల్లె ప్రకృతివనం, క్రీడా ప్రాంగణం, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. 52 ఎకరాలు పాండురంగ రిజర్వాయర్ నిర్మాణానికి తీసుకున్నారు. నికరంగా 260 ఎకరాల వరకు భూమి ఉండాలి. ప్రస్తుతం 244 మంది రైతులకు నోటీసులు ఇచ్చి 215 మందికి సంబంధించిన భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. వారి ఆధీనంలో ఉన్న 205 ఎకరాలను గుర్తించారు. మరో 29 మంది రైతులకు నోటీసులు జారీచేసినా అందుబాటులో రాలేదని అధికారులు చెబుతున్నారు. ఆ 29 మంది రైతుల పట్టాలను, భూములను పరిశీలిస్తేనే పూర్తి స్పష్టత వస్తుందని అంటున్నారు.
మా 135 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ?
ఓవైపు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ సర్వే జరుగుతుండగా.. మరోవైపు పక్కనే ఉన్న శివారు వెంకటాపూర్ గ్రామస్తులు తమ గ్రామ భూముల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివారు వెంకటాపూర్ గ్రామానికి సంబంధించి 41 సర్వే నంబరులో 27.23 ఎకరాలు, 47 సర్వే నంబరులో 4.19 ఎకరాలు, 85 సర్వే నంబరులో 73.12 ఎకరాలు, 100 సర్వేనంబరులో 2.26 ఎకరాలు, 38 సర్వేనంబరులో 28 ఎకరాలు ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డుల్లో ఉందని.. కానీ భౌతికంగా ఈ భూమి కనిపించడం లేదని అంటున్నారు. ఎర్రవల్లిలోని 325 సర్వే నంబరులో తమ గ్రామానికి సంబంధించిన 135 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కలిపారని ఆరోపిస్తున్నారు. గురువారం 325 సర్వేనంబరు పక్కన ఉన్న శివారు వెంకటాపూర్ గ్రామ రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే 40 మంది రైతులు నోటీసులను తిరస్కరించి.. తమ గ్రామ ప్రభుత్వ భూముల లెక్క తేల్చాలంటూ ఆందోళనకు దిగారు. కేసీఆర్ కొనుగోలు చేసిన భూముల్లో తమ గ్రామానికి సంబంధించినవారివీ ఉన్నాయని.. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఆ భూముల లెక్క తేల్చాల్సి ఉన్నా పట్టించుకోలేదని చెప్పారు.