హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు.. నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్..
ABN , Publish Date - Sep 25 , 2026 | 06:59 AM
గణేశ్ నిమజ్జనాలు నేటి (శుక్రవారం)తో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనాలు నేటి (శుక్రవారం)తో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన గణేశ్ నిమజ్జన ఊరేగింపు చంద్రాయణగుట్ట బ్రిడ్జి, ఫలక్‌నుమా, అలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మహారాజాగంజ్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గ్, పీవీ నరసింహారావు మార్గ్ మీదుగా సాగనుంది. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, తార్నాక, టోలిచౌకి, ఎర్రగడ్డ, ఆసిఫ్‌నగర్, రాంనాథ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు అనుబంధ మార్గాల ద్వారా ప్రధాన ఊరేగింపులో కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల్లో నిమజ్జన వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. సాధారణ వాహనాల రాకపోకలను ప్రధాన మార్గాల్లో పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు.
తూర్పు-పడమర, పడమర-తూర్పు దిశల్లో నగరాన్ని దాటే వాహనాలకు బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద మాత్రమే క్రాస్ చేసేందుకు అవకాశం కల్పించారు. వాహనదారులు ఇన్నర్ రింగ్ రోడ్డు, మసాబ్ ట్యాంక్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ మార్గం లేదా ఓఆర్‌ఆర్ వినియోగించాలని సూచించారు. చంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని పలు కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. భారీ వాణిజ్య వాహనాలు, సరకు రవాణా లారీలను నగరంలోకి అనుమతించడం లేదు. భారీ వాహనాలను నగర శివార్లలోనే నిలిపివేసి ఓఆర్‌ఆర్ వైపునకు మళ్లిస్తున్నారు.
మరోవైపు, సెప్టెంబర్ 22 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు నగరంలోకి ప్రవేశించకుండా బయటి రోడ్ల నుంచే నడపాలని అధికారులు సూచించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్, ఎగువ ట్యాంక్ బండ్, పీవీ నరసింహారావు మార్గాల్లో ఖాళీ లారీలు, ట్రక్కులు నిర్ణయించిన ఎగ్జిట్ మార్గాల ద్వారానే తిరిగి వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
అంతేకాకుండా ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం, కట్టమైసమ్మ ఆలయం / దిగువ ట్యాంక్ బండ్ రోడ్డు, ప్రభుత్వ ఉద్యానవనం, ఖైరతాబాద్ రైల్వేస్టేషన్, ఖిల్వత్ మైదానం తదితర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి నిమజ్జనం జరిగే ప్రాంతాలకు కాలినడకన వెళ్లాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణాలు ఉన్న నగరవాసులు ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి