ఇదెక్కడి విడ్డూరం.. ఏఐ మోడల్స్‌కు ఏఐతోనే శిక్షణ
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:42 AM
ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. లాంటి తెలుగు సామెతలను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో గాని ఓపెన్ఏఐ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏఐ మోడల్స్‌కు ఏఐతోనే శిక్షణ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా సంస్థల్లో ఉద్యోగులు తమ పని కోసం ఏఐని ఉపయోగిస్తున్నారు. అయితే ఆ ఏఐను అభివృద్ధి చేసే కంపెనీల్లో కూడా ఉద్యోగులు ఏఐను వాడుతున్నారట. ఏఐకు ఏఐతోనే శిక్షణ ఇస్తున్నారట. ఇదేదో చిన్న సంస్థకు సంబంధించిన వ్యవహారం కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఓపెన్ఏఐలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ పని చేసినట్టు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న సదరు సంస్థ ఉద్యోగులను తొలగించిందని సమాచారం.
తమ కంపెనీలో ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇవ్వడానికి ఓపెన్ఏఐ కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించింది. ఏఐ స్పందన సరిగా ఉందా లేదా అన్నది పరిశీలించడం, దాని సంభాషణలను మెరుగుపరచడం వంటి పనులు వీరు నిర్వహించాలి. ఈ ఉద్యోగులకు సంస్థ గంటకు 4,800 రూపాయల జీతం ఇస్తోంది. అయితే వీరు ఈ పని కోసం మరో ఏఐ సహాయం తీసుకుంటారని ఓపెన్ఏఐ ఊహించలేకపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే ఆ ఉద్యోగులందరిపై వేటు వేసిందని ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.
ఏఐ శిక్షణకు ఏఐను వాడితే తప్పేంటి?
ఈ సందర్భంగా చాలామందిలో కొన్ని ప్రశ్నలు పుడుతున్నాయి. ఏఐ శిక్షణకు ఏఐను వాడితే తప్పా? అని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐ అభివృద్ధిలో మరొక ఏఐ సహాయం తీసుకోవడం వల్ల ‘మోడల్ కొలాప్స్’ అయ్యే ప్రమాదముందని ఓపెన్ ఏఐ చెబుతోంది. అలా చేస్తే భవిష్యత్తుల్లో ఏఐ మోడల్స్ వైవిధ్యాన్ని కోల్పోతాయని వివరిస్తోంది.
ఈ వార్తలూ చదవండి
మోదీతో ఆల్ట్‌మన్, డారియో ఫొటోను ఎడిట్ చేసిన మేటా ఏఐ చీఫ్.. ఆపై డిలీట్
మ్యాక్‌బుక్ ఇవ్వరని తెలిసి జాబ్ వదులుకున్న టెకీ!