మోదీతో ఆల్ట్‌మన్, డారియో ఫొటోను ఎడిట్ చేసిన మేటా ఏఐ చీఫ్.. ఆపై డిలీట్
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:34 PM
మేటా ఏఐ చీఫ్ అలెగ్జాండర్ వాంగ్ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి ఆపై డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, ఓపెన్ ఏఐ సీఈఓ, ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓల గ్రూప్ ఫొటోను ఎడిట్ చేసి డిలీట్ చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మేటా ఏఐ చీఫ్ అలెగ్జాండర్ వాంగ్ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి ఆపై డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భారత్‌లో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా ఏఐ సంస్థల సీఈఓలు ఉన్న చిత్రం అది. మ్యూజ్ ఏఐ సాయంతో ఆ ఫొటోను అలెగ్జాండర్ వాంగ్ ఎడిట్ చేశారు. ఎడమొహంపెడమొహంగా ఉన్న ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ సీఈఓల మధ్య మ్యూజ్ మాస్క్‌ట్‌ను జోడించి ఈ ఫొటోను షేర్ చేశారు. ఇరు ఏఐ సంస్థల సీఈఓల మధ్య సయోధ్య కుదర్చినట్టు సెటైరికల్‌గా ఈ పోస్టు చేశారు. ఆ తరువాత డిలీట్ చేశారు.
ఫొటో నేపథ్యంలో ఇదీ..
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ సమయంలో ఓపెన్ ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్, ఆంథ్రొపిక్ సీఈఓ డారియో ప్రధాని మోదీతో కలిసి పొటో దిగేందుకు నిలబడ్డారు. అది గ్రూప్ ఫొటో కావడంతో అందరూ కలిసి చేతులు కలిపి నిలబడాల్సి ఉంది. అయితే, వాణిజ్యపరంగా ప్రత్యర్థులైన డారియో, ఆల్ట్‌మన్‌లు పక్కపక్కనే ఉన్నప్పటికీ చేతులు కలిపి ఫొటోకు ఫోజులిచ్చేందుకు నిరాకరించారు. దీంతో, ఈ ఉదంతం అప్పట్లో వైరల్‌గా మారింది.
మ్యూజ్ ఏఐ ఏం చేయగలదో చూడండంటూ వాంగ్ ఈ ఏఐ ఎడిటెడ్ ఫొటోను షేర్ చేశారు. ఫొటోలో డారియో, ఆల్ట్‌మన్ మధ్య మ్యూజ్ మాస్కట్ వారి చేతులు పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. వారి మధ్య రాజీ కుదరినట్టు ఉన్నందున మ్యూజ్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలనే అర్థంలో వాంగ్ మరో సరదా కామెంట్ చేశారు. మా నోబెల్ బహుమతిని ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలో చెప్పాలని అన్నారు.
అయితే, జనాల నుంచి మంచి స్పందిన వస్తున్న తరుణంలో ఈ ఫొటో కనుమరుగైంది. వాంగ్ ఆ ఫొటోను తన టైమ్ లైన్ లోంచి డిలీట్ చేశారు. ఇందుకు కారణం ఏంటీ అనే వివరాలపై స్పష్టత లేదు. మరో కాంట్రవర్సీ అవుతుందని తానే వెనక్కు తగ్గారా? లేక ఎవరైనా తీసేయమని చెప్పారా? అనే విషయాలు తేలాల్సి ఉంది. ఈ పోస్టు ప్రస్తుతం వాంగ్ టైమ్ టైమ్‌లో లేకపోయినప్పటికీ ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్