Share News

భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:59 PM

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి.

భోగాపురం విమానాశ్రయం.. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
Bhogapuram Airport

విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై 5వ తేదీ లేదా 8వ తేదీన ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) నిర్ణయించారు.


యుద్ధ ప్రాతిపదికన పనులు..

ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటికే ఆహ్వానం పంపారు. మోదీ షెడ్యూల్ ఆధారంగా జూలై 5వ తేదీ లేదా 8వ తేదీల్లో ఒకటి ఖరారు కానుంది. జూన్ 30వ తేదీ కల్లా మిగిలిన అన్ని పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అదనపు సిబ్బందిని మోహరించి రాత్రింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు.


ఇమ్మిగ్రేషన్ హోదా..

అంతర్జాతీయ విమానాల రాకపోకల కోసం అవసరమైన ఇమ్మిగ్రేషన్ స్టేటస్ నోటిఫికేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్‌గా కేంద్రం నోటిఫై చేసింది.

కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు..

విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది.


ఆనందపురం జంక్షన్ ఫ్లై ఓవర్..

విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే మార్గంలో అత్యంత రద్దీగా ఉండే ఆనందపురం జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఫ్లై ఓవర్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన డీపీఆర్ (Detailed Project Report) 45 రోజుల్లో సిద్ధం కానుంది.

డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్..

భోగాపురం వరకు మెట్రో సౌకర్యాన్ని కల్పించేందుకు RITES సంస్థ సవరించిన డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది. ఇది డబుల్ డెక్కర్ మోడల్‌లో ఉండబోతోంది (కింద రోడ్డు, పైన మెట్రో). విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు ఈ కారిడార్ విస్తరించనుంది.


కోస్టల్ కారిడార్, కొత్త రోడ్లు..

రోడ్ నంబర్ 12, 14 పనుల కోసం అటవీ, రక్షణ శాఖల అనుమతులను వేగవంతం చేశారు. తీర ప్రాంతం వెంట విశాఖను భోగాపురంతో కలిపే ప్రత్యేక కోస్టల్ కారిడార్ పనులు కూడా ఊపందుకున్నాయి.

ప్రాముఖ్యం, ప్రయోజనాలు..

భోగాపురం ఎయిరోసిటీ, ఐటీ హబ్స్, లాజిస్టిక్ పార్కుల వల్ల ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి లభించనుంది.

పర్యాటక రంగం: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రలోని పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది.

వ్యాపార కనెక్టివిటీ: ఫార్మా, మత్స్య పరిశ్రమల ఎగుమతులకు ఈ విమానాశ్రయం కేంద్ర బిందువుగా మారనుంది.


ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇదో మైలు రాయి: రామ్మోహన్

Ram-Mohan-Naidu-Kinjarapu.jpg

భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు త్వరలో పూర్తవుతాయని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వ సహకారంతో ఏపీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు జూలై మొదటి వారంలో ప్రారంభించాటానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇదో మైలు రాయని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించటానికి ప్రయత్నిస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

‘మావిగన్ జోకర్’‌గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు

మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు

పాదయాత్ర కాదు..‌ మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 06:02 PM