పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:57 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు.
విజయవాడ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Budda Venkanna) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు. జగన్ అండ్ కోకు వంత పాడుతున్న వారి తీరును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ చెప్పారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు రాధాకృష్ణ మీద పడ్డారని విమర్శించారు. ఈరోజు(గురువారం) విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌లకు.. ఆంధ్రజ్యోతికి సంబంధమేంటనీ ప్రశ్నించారు. పత్రిక కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా అని ప్రశ్నించారు. రాధాకృష్ణపై దాడి చేస్తా, అరెస్టు చేస్తానని బెదిరిస్తావా అని ధ్వజమెత్తారు. ముందు జగన్ తన సొంత మీడియా సాక్షిలో రాసిన నీచపు రాతలకు ఆయనను ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు అరెస్టు చేయాలని నిలదీశారు. జగన్ తల్లి విజయమ్మ ఆయన గురించి లేఖ రాస్తే నీ పత్రికలో రాశావా అని ప్రశ్నించారు.
లోకేశ్ పాదయాత్ర ద్వారా జగన్‌కు సినిమా చూపించారు..
అమరావతి మహిళల గురించి జగన్ తన సాక్షి మీడియాలో అనుచితంగా రాశారని.. కానీ భారతీరెడ్డి వాళ్లకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది జగన్ కాదా అని ఫైర్ అయ్యారు. రాధాకృష్ణ రాసిన ‘కొత్త పలుకు’ను చంద్రబాబు, లోకేశ్ ఖండించలేదని మాట్లాడే హక్కు జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ‘సొంత చెల్లినే తిట్టించిన నువ్వా మహిళల హక్కుల గురించి మాట్లాడేది. నీ మావిగన్ ట్రోల్స్ కాకుండా ఉండటానికే రాధాకృష్ణపై బురద జల్లుతున్నావు. నీవు చెప్పినట్లు రాయని చానల్స్, పత్రికలను బెదిరిస్తావా. నీ పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తావా. గతంలో రామ్‌గోపాల్ వర్మతో నువ్వు సినిమాలు తీయిస్తే ప్రజలే ఛీ కొట్టారు. లోకేశ్ తన పాదయాత్ర ద్వారా నీకు ఇప్పటికే సినిమా చూపించారు. చంద్రబాబు వరకు అక్కర్లేదు... లోకేశ్‌కే ట్రైలర్ చూపించలేవు. సాక్షి పేపర్ పెట్టిన నాటి నుంచి అవినీతికి పాల్పడిన వైసీపీ ఎంపీ నుంచి సర్పంచ్‌ల వరకు ఒక్క వార్త అయినా రాశావా. గత ఐదేళ్ల పాలనలో వేల కోట్లు దోచుకుంది మీరు. ఒక్క అవినీతి గురించి అయినా నీ సాక్షిలో రాశావా. సాక్షి.. నీ పత్రిక... ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ పత్రిక.. చంద్రబాబు, లోకేశ్‌లకు నీలాగా పత్రికలు లేవు’ అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
అమరావతి మహిళల గురించి అనుచితంగా మాట్లాడారు..
అమరావతి మహిళల గురించి అనుచితంగా మాట్లాడింది వైసీపీ నేతలు కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఏనాడైనా తప్పుగా మాట్లాడామని జగన్ అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పారా అని నిలదీశారు. ‘ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళలను ఎక్కడ అవమానించారు. నీ చుట్టూ ఉన్న వారు నువ్వు తానా అంటే తందానా అంటున్నారని ఘాటుగా చెప్పారు. నీకే సినిమా అయిపోయింది... వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిన్ను తరిమి కొడతారు. నీ తల్లి, చెల్లి ఆవేదన గురించి ఒక్కసారి అయినా నీ సాక్షిలో రాశావా. నువ్వు మళ్లీ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేయిస్తావా. నీకు అసలు నీతులు చెప్పే కనీస అర్హత ఉందా. మేము రాధాకృష్ణకు మద్దతు ఇవ్వడం లేదు... పత్రికా కార్యాలయంపై దాడులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వెళ్లిన నేత ఎవరైనా నాతో బహిరంగ చర్చకు రావాలి. మావిగన్ పేరు జగన్ చెప్పగానే ప్రజలు చేసిన ట్రోల్స్‌తో జగన్ భయపడ్డారు. అందుకే ఇప్పుడు రాధాకృష్ణను అడ్డం పెట్టుకుని అల్లరి చేసేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్ నువ్వు అసలు మళ్లీ అధికారంలోకి వస్తావా... పగటి కలలు కంటున్నావ్. పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు’ అని బుద్దా వెంకన్న సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
జగన్ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు
రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News