ఏపీ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: రామ్మోహన్
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:55 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి కేవలం తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప.. ఆయనకు పని ఏమీ లేదని విమర్శించారు.
శ్రీకాకుళం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి కేవలం తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప.. ఆయనకు పని ఏమీ లేదని విమర్శించారు. ఈ రెండున్నరేళ్లలో ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగాయని... కానీ ఒక్కసారి కూడా అసెంబ్లీకి జగన్ వచ్చి ఏ ఒక్క సమస్యపైన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈరోజు (శుక్రవారం) శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయడు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం జగన్ రాజకీయ పబ్బం గడిపేందుకే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన చేసిన విమర్శల్లో ఏ ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయారని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదు..
ఏపీకి టీడీపీ హయాంలోనే డీఎస్సీలు వచ్చాయి తప్ప.. వైసీపీ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని రామ్మోహన్ చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని అన్నారని.. ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సంవత్సరం తర్వాత డీఎస్సీపైన, మంత్రి లోకేశ్‌పైన జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏపీని అభివృద్ధి చేస్తుంటే జగన్ జీర్ణించుకోలేక రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని ఆలోచిస్తున్నారని ఆగ్రహించారు.
ఐదేళ్లు విధ్వంసం సృష్టించారు..
జగన్‌కు 151 సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించి ముఖ్యమంత్రిని చేశారని.. కానీ వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసం సృష్టించారని రామ్మోహన్ దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి 16,000 ఉద్యోగాలను ఇచ్చారని ప్రస్తావించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికను కూల్చారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసం సృష్టించడంతోనే జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఓడించారని అన్నారు. అయినా ఆయన విధ్వంసాన్ని విడిచి పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ సంకల్పం రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని, యువతకు ఉద్యోగాలు రాకూడదని కుట్రలకు పాల్పడుతున్నారని రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ
నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News