Share News

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై మంత్రి సత్యకుమార్ ధ్వజం

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:12 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్‌ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు.

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై  మంత్రి సత్యకుమార్ ధ్వజం
AP Minister Satya Kumar

ప్రకాశం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి సత్యకుమార్(AP Minister Satya Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్‌ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు. కోట్లాదిమంది భక్తులు ఆరాధించే తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. కెమికల్స్ ఉపయోగించి లడ్డూ తయారు చేశారని ఆగ్రహించారు. రూ.250 కోట్ల అవినీతి చేసిన వాళ్లని జైలుకు పంపితే దాన్ని రెడ్‌బుక్ రాజ్యాంగం అని ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.


రప్పా రప్పా అన్న వాళ్లని వదిలేయాలి..

ప్రకాశం జిల్లాలో మంత్రి సత్యకుమార్ గురువారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన వాళ్లని వదిలేయండి, రప్పా రప్పా అన్న వాళ్లని వదిలేయండి, తలలు ఎగరేసి నరుకుతామనే వాళ్లని ఉపేక్షించాలనేలా జగన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీల వల్ల.. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు.


జగన్ మాటలు నవ్వువస్తోంది..

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ వ్యక్తిగత విషయాన్ని వైసీపీ బూతద్దంలో చూపిస్తోందని మంత్రి సత్యకుమార్ దుయ్యబట్టారు. ‘వ్యక్తిగత విషయాలను కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. జగన్ మాటలు చూసి ఆయన అవగాహన రాహిత్యంపై నవ్వొస్తోంది. సొంత బాబాయ్‌కు గొడ్డలి పోటు వేసి గుండెపోటుగా నమ్మించాలని జగన్ చూశారు. సొంత చెల్లెలి మీదే తండ్రిని చంపిన కేసు మోపేందుకు కుట్రపన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి భూములు కొట్టేయాలని ప్రయత్నించారు. సొంత ఖజానా నింపుకోవడం కోసం నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీయడం జగన్‌కు పాపంగా అనిపించడం లేదు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా బాధ్యతలు విస్మరించి అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు.


జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి..

కదిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణి మరణిస్తే.. ఆస్పత్రి మూసివేశామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించినట్లుగా వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవముంటే జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. వారానికి ఒకరోజు విజిటర్ పొలిటీషియన్‌లా జగన్ ఏపీకి వచ్చి పోతున్నారు. జగన్‌కు ఇప్పటికే ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆత్మ విమర్శ చేసుకుని సరైన మార్గంలోకి రాకపోతే.. మీ రాజకీయ సమాధి మీరే కట్టుకున్నట్లే. ఏపీలో అమాయకులను మా ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. మద్యం కేసులో ఉన్నవాళ్లు, ప్రజల ప్రాణాలు తీసినవాళ్లు, పోలింగ్ బూతుల్లోకి వెళ్లి గొడ్డలితో దాడులు చేసిన వాళ్లే అరెస్టయ్యారు’ అని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 01:58 PM