స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు
ABN , Publish Date - May 19 , 2026 | 03:27 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.
విజయవాడ, మే19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) విజయవాడ వేదికగా షర్మిల మీడియాతో మాట్లాడారు. నేటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రజలకు అపారమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని వ్యాఖ్యానించారు. భూతద్దం పెట్టి వెతికినా వైఎస్ లాంటి వారు పుట్టరని చెప్పుకొచ్చారు.
స్విచ్‌లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదు..
వైఎస్ పేరు చెప్పుకుని జగన్ ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర చేశారని షర్మిల అన్నారు. ఆయన సీఎం అయ్యాక స్విచ్‌లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం స్విచ్‌లు నొక్కితే మళ్లీ మళ్లీ సీఎంలు అవరనేది కొంతమంది తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ మధ్య నాయకులు సీఎం అవగానే ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్ రెండోసారి సీఎం అయ్యాక ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించారని.. ఈ క్రమంలో రచ్చబండకు వెళ్తుండగా చనిపోయారని ప్రస్తావించారు.
వైఎస్ ఆశయాలను నాశనం చేశారు..
తండ్రి ఆశయాలను సాధిస్తామని చెప్పి.. ఓట్లు వేయించుకున్న వారు.. ఆ తర్వాత ఆయన ఆశయాలనే నాశనం చేశారని షర్మిల దుయ్యబట్టారు. నిన్న సిగ్గులేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేశారని సెటైర్లు గుప్పించారు. వాళ్ల ప్రభుత్వంలో భారాలు మోపిన విషయాలు మరిచారా..? అని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక కూడా ప్రధాని మోదీ చెప్పినట్లుగా తల ఆడించారని విమర్శించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News