Share News

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - May 18 , 2026 | 08:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) భారీ పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
AP CM Chandra babu Naidu

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) భారీ పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (CM Chandrababu Naidu) రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు ఈరోజు (సోమవారం) రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ (Govindarajan) నేతృత్వంలోని బృందం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా బుల్లెట్ మోటార్ సైకిల్ మోడళ్లను సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పించటంపై ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.


పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది..

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి 18 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోందని సీఎం పేర్కొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు.


15వేల మందికి ఉపాధి..

ఈ తయారీ యూనిట్‌లో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రధాన తయారీ ప్లాంట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపు రానుందని భావిస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి సుమారు 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో ‘ఫ్లైయింగ్ ఫ్లీ C6’ పేరుతో ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా ఏపీ కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 08:27 PM