స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉంది: మంత్రి మండిపల్లి
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:04 AM
తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు.. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచీ ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్.. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 6: తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు.. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ స్థాపించినప్పటి నుంచీ ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్.. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని పేర్కొన్నారు. టీడీపీకి వెన్నెముకగా ఉండే బీసీలను ఆదరించటం పార్టీ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే మాటకు పార్టీ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారన్నారు.
రాజ్యాంగ బద్ధంగా బీసీలకు 34% రిజర్వేషన్ హక్కు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పోరాడుతోందని మంత్రి తెలిపారు. అటువైపు ఏబీసీడీలు రాని అవగాహన లేని జగన్‌మోహన్ రెడ్డి ఉంటే.. ఈ పక్కన విజన్ కలిగిన ఎకనమిస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. భవిష్యత్తులో కోర్టు తీర్పులు ఎలా ఉన్నా.. తమ పార్టీ అజెండా 34శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటుందని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జగన్ పార్టీ బీసీల రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. కోర్టుల్లో పిటిషన్లు వేసి ఎన్నికలను ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయని మండిపల్లి అన్నారు. గ్రామీణ రోడ్లు, పంచాయతీ రాజ్ వ్యవస్థకు సుమారు రూ.7,500 కోట్లతో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాయలసీమ ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో హార్టికల్చర్ మిషన్ తీసుకువచ్చామని వెల్లడించారు. మదనపల్లెలో ఎంతో ఉన్నత స్థాయిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి మరో పేరు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వార్డు స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి వరకు అన్ని స్థానిక సంస్థల్లోనూ కూటమి విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కేవలం తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారని.. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమయ్యారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి..
ఫ్లైదుబాయ్ విమానంలో దాడి వెనుక ఇరాన్ ఉందనిపిస్తోంది: ట్రంప్
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్
Read Latest AP News And Telugu News