Share News

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:56 AM

వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశాలు రాకపోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ తాజాగా స్పందించాడు. వైభవ్‌కు పలు కీలక సూచనలు చేశాడు.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్
Morne Morkel

ఇంటర్నెట్ డెస్క్: యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశాలు రాకపోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ వరుస మ్యాచుల్లో విఫలమవుతుండటంతో అతడిని తప్పించి వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ గంభీర్ నుంచి పలువురు వైభవ్‌ అవకాశాల గురించి ఎదురు చూడాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇదే విషయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ తాజాగా స్పందించాడు. వైభవ్‌కు పలు కీలక సూచనలు చేశాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టీ20కి ముందు మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.


‘వైభవ్‌లో ఉన్న ప్రతిభ గురించి మనందరికీ తెలుసు. అతడు నాణ్యమైన ఆటగాళ్లతో కలిసి ఎక్కువ సమయం గడపాలి. ఆ స్థాయి క్రికెటర్లతో కలిసి శిక్షణ తీసుకోవడం అతడి ఆటకు ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా.. జట్టుతో కలిసి బస్సులో ప్రయాణించడం, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం, హోటల్‌లో సహచరులతో గడపడం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. సీనియర్ ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను ఎలా సిద్ధం చేసుకుంటారు? వారి ప్రణాళికలు ఏంటి? వంటి విషయాలను గమనించడం యువ ఆటగాళ్లకు చాలా కీలకం. ప్రస్తుతం వారిని చూసి ఎదగడమే వైభవ్ బాధ్యత’ అని పేర్కొన్నాడు.


తుది జట్టుపై సస్పెన్స్

వెస్టిండీస్‌తో తొలి టీ20లో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేస్తాడా? అనే ప్రశ్నకు మోర్కెల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆసియా క్రీడల్లో ఆ కాంబినేషన్‌ను ఉపయోగించినప్పటికీ.. ప్రస్తుత సిరీస్‌కు అత్యుత్తమ కాంబినేషన్ ఏదో మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తామని చెప్పాడు.


ఇవి కూడా చదవండి:

సీఎస్కేలోకి హార్దిక్ పాండ్య.. జహీర్ ఖాన్ కారణంగా మారిన సమీకరణాలు!

భారత్ మాకు క్షమాపణ చెప్పాల్సిందే.. డబ్ల్యూసీఎల్ నుంచి తప్పుకున్న పాకిస్థాన్

Updated Date - Oct 06 , 2026 | 08:56 AM