Share News

భారత్‌కు పోటీ ఇస్తారా?

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:01 AM

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియా.. ఆ వెంటనే మరో సిరీస్‌కు సిద్ధమైంది. మంగళవారం నుంచి వెస్టిండీస్‌తో ఐదు టీ20ల పోరుకు తెర లేవనుంది. ఇప్పటికే...

భారత్‌కు పోటీ ఇస్తారా?

రాత్రి 7 గం. నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌లో..

  • హార్డ్‌ హిట్టర్లతో విండీస్‌

  • వైభవ్‌కు చోటు కష్టమే!

  • నేటి నుంచి ఐదు టీ20ల సిరీస్‌

లఖ్‌నవూ: ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన టీమిండియా.. ఆ వెంటనే మరో సిరీస్‌కు సిద్ధమైంది. మంగళవారం నుంచి వెస్టిండీస్‌తో ఐదు టీ20ల పోరుకు తెర లేవనుంది. ఇప్పటికే ముగిసిన వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఇక ధనాధన్‌ పోరు కోసం జపాన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన శ్రేయా స్‌ సేన బరిలోకి దిగనుంది. స్టార్‌ పేసర్‌ బుమ్రా కు విశ్రాంతినిచ్చారు. మరోవైపు ఈ సిరీస్‌ శ్రేయా స్‌ కెప్టెన్సీకి కూడా సవాల్‌గా మారనుంది. బలహీన జింబాబ్వే, అఫ్ఘానిస్థాన్‌లపై సిరీస్‌లు గెలిచినా.. రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌, ఈ ఫార్మాట్‌లో పవర్‌హౌస్‌గా పేరుగాంచిన కరీబియన్లను కట్టడి చేయగలిగితే శ్రేయాస్‌ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అటు విండీస్‌ వన్డే సిరీస్‌లో చూపిన పోరాట పటిమను పొట్టి ఫార్మాట్‌లోనూ చూపాలని భావిస్తోంది. హార్డ్‌ హిట్టర్లతో కూడిన కరీబియన్లు ఈ సిరీస్‌కు వదులుకోకూడదనే కసితో ఉన్నారు. కానీ భారత్‌లో తామాడిన చివరి 10 మ్యాచ్‌ల్లో తొమ్మిదింటిని కోల్పోవడం ఆ జట్టు నిలకడలేమిని చూపుతోంది.

జట్టు కూర్పు ఎలా?: ఓపెనర్లుగా ఎవరిని ఆడించాలన్న సమస్య టీమిండియాకు ఎదురవుతోంది. అనుభవజ్ఞుడు సంజూ శాంసన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలా? లేక టీనేజ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీతో ముందుకెళ్లాలా? అనే చర్చ సాగుతోంది. ఆసియాగేమ్స్‌లో వైభవ్‌ ఓపెనర్‌గా రావడంతో శాంసన్‌ వన్‌డౌన్‌లో ఆడాడు. అక్కడి పిచ్‌లను అనుసరించి కోచ్‌ లక్ష్మణ్‌ తీసుకున్న నిర్ణయమిది. కానీ ఈ మ్యాచ్‌లు స్వదేశంలో కాబట్టి అభిషేక్‌-శాంసన్‌ జోడీ వైపే ప్రధాన కోచ్‌ గంభీర్‌ మొగ్గుచూపే అవకాశం ఉంది. మరోవైపు వైభవ్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడికి చోటు కల్పించడం కష్టమవుతోందని గౌతీ అభిప్రాయపడ్డాడు. ఇషాన్‌, శ్రేయాస్‌, తిలక్‌, నితీశ్‌, దూబేలతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌ విభాగంలో అర్ష్‌దీ్‌పనకు జతగా మయాంక్‌, ప్రిన్స్‌ యాదవ్‌లలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ ప్రధాన స్పిన్నర్లుగా ఆడనున్నారు. అభిషేక్‌ను అదనపు బౌలర్‌గా వినియోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్‌ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనుకుంటే ఒక పేసర్‌ను తొలగించి నమన్‌ ధిర్‌ను ఆడించే అవకాశమూ లేకపోలేదు.


సత్తా చాటితేనే..: ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌ల్లో విండీస్‌ బ్యాటర్లు పరుగులు వెల్లువెత్తిస్తుంటారు. కానీ జట్టుగా ఆడితే మాత్రం ఆ స్థాయి ఆటతీరు కనిపించదు. షెఫర్డ్‌, పోవెల్‌, హెట్‌మయెర్‌, రూథర్‌ఫోర్డ్‌, హొస్సేన్‌లకు ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కాబట్టి ఇక్కడి పరిస్థితులు వారికి కొత్త కాదు. హోప్‌ కెప్టెన్సీలోని ఈ జట్టుకు తమదైన రోజున ఎవరినైౖనా ఓడించే సత్తా ఉంది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో అదరగొట్టిన కమిల్‌ పూరన్‌ ఓపెనర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. రోస్టన్‌ చేజ్‌, కీమో పాల్‌, పోవెల్‌, షెఫర్డ్‌ల రూపంలో ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. లెఫ్టామ్‌ స్పిన్నర్లు అకీల్‌ హొసేన్‌, గుడకేశ్‌ మోటీ, పేసర్‌ షామర్‌ జోసెఫ్‌ బౌలింగ్‌లో భారత్‌ను ఇబ్బంది పెట్టగల సత్తావున్నవారే. ఏది ఏమైనా సమష్ఠి ఆటతీరుతో తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు చెక్‌ పెట్టాలని విండీస్‌ భావిస్తోంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌, శాంసన్‌, ఇషాన్‌, శ్రేయాస్‌ (కెప్టెన్‌), తిలక్‌, దూబే, నితీశ్‌, అక్షర్‌, కుల్దీప్‌, అర్ష్‌దీప్‌, ప్రిన్స్‌/మయాంక్‌.

వెస్టిండీస్‌: కమిల్‌ పూరన్‌, హోప్‌ (కెప్టె న్‌), హెట్‌మయెర్‌, పోవెల్‌, రూథర్‌ఫోర్డ్‌, షెఫర్డ్‌, స్ర్పింగర్‌, హొసేన్‌, మోటీ, షామర్‌ జోసెఫ్‌, ఫోర్డ్‌.

పిచ్‌, వాతావరణం

ఎర్ర, నల్లరేగడి మిశ్రమంతో కూడిన మట్టితో రూపొందించిన పిచ్‌పై మ్యాచ్‌ జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ వికెట్‌పై భారీగా పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లోనూ అదే పునరావృతం కావచ్చు. సోమవారం వర్షంతో ప్రాక్టీస్‌ సెషన్స్‌కు ఇబ్బంది కలిగినా.. మ్యాచ్‌ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 06:05 AM