సీఎస్కేలోకి హార్దిక్ పాండ్య.. జహీర్ ఖాన్ కారణంగా మారిన సమీకరణాలు!
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:36 AM
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్-2026 ముగిసినప్పటి నుంచి పాండ్యను తమ జట్టులోకి తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్-2026 ముగిసినప్పటి నుంచి పాండ్యను తమ జట్టులోకి తీసుకునేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ముందు ఉన్నట్లు సమాచారం. తాజాగా హార్దిక్ కోసం ఓ ఫ్రాంచైజీ నుంచి ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి మరోసారి ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ.. బ్యాటింగ్, బౌలింగ్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఉండటంతో అతడికి డిమాండ్ కొనసాగుతోందని సమాచారం.
అయితే హార్తిక్ చెన్నైకి వెళ్లే అవకాశాలపై మాత్రం ఓ కీలక అంశం ప్రభావం చూపుతున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఇటీవలే నియమితులైన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న సమయంలో జహీర్‌కు, హార్దిక్‌కు మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో జహీర్ కోచ్‌గా ఉన్న నేపథ్యంలో హార్దిక్‌ను సీఎస్కే తీసుకునే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే చెన్నైలో కొత్త మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఏర్పడటంతో పరిస్థితులు మారే అవకాశం ఉందని సమాచారం. కాలంతో పాటు వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలు కూడా మారవచ్చని.. హార్దిక్, జహీర్ మధ్య ప్రస్తుత సమీకరణాలపై స్పష్టత లేదని వార్తలు వస్తున్నాయి.
నవంబర్ 15లోగా నిర్ణయం!
హార్దిక్ ట్రేడ్‌పై వచ్చే నెలలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్-2027 వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌కు నవంబర్ 15 చివరి తేదీ. దీంతో అంతకంటే ముందే హార్దిక్ భవితవ్యంపై ముంబై ఇండియన్స్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. హార్దిక్ ఫిట్‌నెస్‌ను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, భారత జట్టు మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడు త్వరలో జరగనున్న న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ భారత్ ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా కొనసాగనున్నాడు.
ఇవి కూడా చదవండి:
నికోలస్ పూరన్ విధ్వంసం.. టొరంటో సిక్సర్స్‌కు కెనడా సూపర్ 60 టైటిల్
వైభవ్ సూర్యవంశీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన అభిషేక్ శర్మ..