కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
ABN , Publish Date - Nov 05 , 2026 | 03:19 PM
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అబద్ధాలు, అరాచకాలతో ఓటర్లను మభ్యపెట్టి, భయపెట్టి గెలవాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అబద్ధాలు, అరాచకాలతో ఓటర్లను మభ్యపెట్టి, భయపెట్టి గెలవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు (గురువారం) అమరావతి వేదికగా మీడియాతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. పులివెందుల నియోజకవర్గంలోని ఎర్రిపల్లిలో పెట్రోల్ బాంబులతో దాడులు చేసి ఓటర్లను వైసీపీ శ్రేణులు భయపెడుతున్నారని ఆగ్రహించారు.
పెట్రోల్ బాంబులతో భయపెడుతున్నారు..
పులివెందులలో ఓటర్లు స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు వస్తుంటే పెట్రోల్ బాంబులతో భయపెడుతున్నారని పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరులో ఓటింగ్ శాతం పెరిగిందని కానీ కడపలో ఓటింగ్ శాతం పెరగడం లేదని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి దౌర్జన్యాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కుప్పంలో బయటి ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకువచ్చి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. కడప, పులివెందులలోని పోలింగ్ కేంద్రాల్లో జగన్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులు..
మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన తీర్పే... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వస్తుందని పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓటర్లను అడ్డుకుంటే పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయని మండిపడ్డారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కుమారుడు వెంకట శివారెడ్డి టీడీపీ ఏజెంట్లపై దౌర్జన్యంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. రైల్వేకోడూరులో పెట్రోల్ బాంబులతో టీడీపీ శ్రేణులపై దాడులు చేశారని ఆగ్రహించారు. పల్నాడులో టీడీపీ కార్యకర్తపై రాళ్లతో దాడులు చేశారని అన్నారు. అరాచకాలు, దౌర్జన్యాలతో ఓట్లను భయపెట్టేందుకు జగన్ రెడ్డి చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు కూటమి వైపు ఉన్నారనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాంది ఫౌండేషన్ 28 ఏళ్ల ప్రస్థానం.. ఆనంద్ మహీంద్రాకు చంద్రబాబు థ్యాంక్స్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక: ఏపీ ఎస్‌ఈసీ
ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News