ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక: ఏపీ ఎస్‌ఈసీ
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:26 PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మెజారిటీ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించారు.
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC Anil Chandra Puneetha) స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మెజారిటీ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించారు. మురసు తుఫాన్, వాతావరణ పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఈరోజు (బుధవారం) విజయవాడలో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై ఎస్‌ఈసీ దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని శాఖల సమన్వయం తప్పనిసరని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా మార్గనిర్దేశం చేశారు.
పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి: మల్లికార్జున
అలాగే, పోలింగ్ సిబ్బంది నియామకం, ఏర్పాట్ల గురించి ఏపీ ఎన్నికల కార్యదర్శి డా. ఏ. మల్లికార్జున మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు 2.52 లక్షల మంది, కౌంటింగ్ కోసం 52 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆయా పరిస్థితుల ఆధారంగా పోలింగ్ కేంద్రాల లోపలా వీడియోగ్రఫీకి అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. ఏపీలో 2.61 కోట్లకు ఓటర్ల సంఖ్య చేరిందని.. మైక్రో లెవెల్ ప్లానింగ్‌తో ఎన్నికలను నిర్వహిస్తామని మల్లికార్జున పేర్కొన్నారు.
పటిష్ఠ ప్రణాళిక అమలు చేస్తున్నాం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
స్థానిక సంస్థల ఎన్నికల శాంతిభద్రతలు, పోలీసు బందోబస్తు గురించి ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నందున ఆయా కేంద్రాల వద్ద ప్రజల రద్దీ నివారణకు తగినంతగా పోలీసు బలగాలను మోహరించామని చెప్పుకొచ్చారు. సెక్టార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,843 మంది అభ్యర్థులు: మైలవరపు కృష్ణతేజ
ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల గురించి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలకు గానూ 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మైలవరపు కృష్ణ తేజ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News