ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Nov 03 , 2026 | 09:40 PM
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ పాలనపై పట్టణ, నగర ప్రజలు విశ్వాసం చూపారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈవీఎం అయినా .. బ్యాలెట్ అయినా విజయం కూటమిదేనని ఉద్ఘాటించారు.
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ పాలనపై పట్టణ, నగర ప్రజలు విశ్వాసం చూపారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా విజయం కూటమిదేనని ఉద్ఘాటించారు. జనసేనకు దక్కిన బలమైన మద్దతుకి కృతజ్ఞతలు తెలిపారు. నగర పాలక, పురపాలక, నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి పక్షాలకు దక్కుతున్న అఖండ విజయాలు ఇవని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ పాలనకు దక్కిన మద్దతుగా భావిస్తున్నామని.. ఇది ఎంతో అమూల్యమైన తీర్పు అని పేర్కొన్నారు.
ఈ ఫలితాలే నిదర్శనం..
మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పట్టణ ప్రజలు విశ్వాసం కనబరుస్తున్నారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ ఈవీఎంలను నిందించిందని విమర్శించారు. ఇప్పుడు బ్యాలెట్ ద్వారా చేపట్టిన స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు అదేస్థాయి విజయాన్ని కూటమికి ఇచ్చారని వెల్లడించారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి దక్కిన బలమైన మద్దతు ఎంతో విలువైనదని చెప్పుకొచ్చారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..
ఛైర్మన్, మేయర్ అభ్యర్థులకు దక్కిన విజయాలు, ఆధిక్యతలు పరిశీలిస్తుంటే పట్టణ, నగర ప్రజలు జనసేనకు ఇస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని పవన్ కల్యాణ్ తెలిపారు. వారు పార్టీ పట్ల కనబరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీలకు అండగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. గెలుపు కోసం కృషి చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన ఘన విజయాన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సాధిస్తామనే విశ్వాసం తమకు ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News