Share News

ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 09:36 PM

ఏలూరు జిల్లాలో వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఏలూరు జిల్లాలో వరదలు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లాలో వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాల్లో గండి ప్రభావంపై ఆరా తీశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మనమిత్ర యాప్ ద్వారా బాధితులు తమ సమస్యలు వెంటనే సీఎంఓ సిబ్బందికి తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.


గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. అధికారుల వివరణ..

ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన బుట్టాయగుడెం, వేలేర్పాడు, పోలవరం మండలం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండిపోయి పొంగిపొర్లుతున్నాయని ఏలూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ఏరియల్ వ్యూ అనంతరం ఆర్టీజీఎస్‌లో సీఎం చంద్రబాబు ఈరోజు (బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.


ముంపు ప్రాంతాలను త్వరితగతిన క్లియర్ చేయాలి..

తుఫాన్ ప్రభావం అనంతర పరిస్థితులపై రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు వివిధ వాగులు, కాలువలకు వరద ప్రవాహాలు పెరిగాయని తెలిపారు. ఎర్రకాలువ, గోనెల వాగు తదితర ప్రాంతాలకు నీటి ప్రవాహాలు వస్తున్నాయని అధికారులు వివరించారు. తెలంగాణాలో కురిసిన వర్షాల కారణంగా ఈ కాలువలకు వరద వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కారంచేడు నుంచి కొత్తపట్నం, చీరాల, చిలకలూరిపేట, పర్చూరు ముంపు ప్రాంతాలను త్వరితగతిన క్లియర్ చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ప్రజలను అప్రమత్తం చేయాలి..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాగులు, వంకలకు వస్తున్న వరద ప్రవాహాలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఏపీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజికి 25,375 క్యూసెక్కుల వరద నీరు చేరిందని అన్నారు. నల్లమడ డ్రెయిన్‌కు 47 వేల క్యూసెక్కులు, ఎర్రకాలువకు 19,756 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం చేరిందని వెల్లడించారు. తమ్మిలేరు, గోనెల వాగుకు 5500 క్యూసెక్కులు, పెద్ద వాగుకు 9500 క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు చేరాయని వివరించారు. పొంగిపొర్లుతున్న వాగుల కారణంగా వివిధ మార్గాల్లో రాకపోకలపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు

స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 10:16 PM