Share News

అబద్ధాలు ప్రచారం చేయడంలో సజ్జలకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదు: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:25 PM

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.

అబద్ధాలు ప్రచారం చేయడంలో సజ్జలకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదు: అచ్చెన్నాయుడు
AP Minister KinjaraPu Atchannaidu

అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై (Sajjala Ramakrishna Reddy) ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister KinjaraPu Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అచ్చెన్నాయుడు ట్వీట్ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో అప్పుల భారంతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. నేడు కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మారుస్తోందని వ్యాఖ్యానించారు. తమ గణాంకాలు ప్రస్తావించామని.. దమ్ముంటే సమాధానం చెప్పాలని సజ్జలకు సవాల్ చేశారు.


వైసీపీ వైఫల్యం వల్ల 2023-24లో 143 లక్షల మెట్రిక్ టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయిందని అచ్చెన్నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 237 లక్షల టన్నులకు పెంచి 51శాతం వృద్ధిని నమోదు చేసిందని ప్రస్తావించారు. ధరల స్థిరీకరణ నిధి (PSF) కింద కేటాయింపులు పెంచి, సుమారు రూ.588 కోట్లతో పొగాకు, మామిడి, ఉల్లి, కోకో రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చామని వివరించారు. ఉల్లి రైతులకు గతంలో ఉన్న రూ.25 వేల నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.50 వేలకు పెంచి ఆదుకున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం మొక్కజొన్న సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో నిరంతరం చర్చిస్తూ రైతులకు అనుకూల నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైక్రో ఇరిగేషన్‌లో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టామని చెప్పారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యంగా వదిలేసిన రూ.881 కోట్ల డ్రిప్, స్ప్రింక్లర్ బకాయిలను కూడా తామే చెల్లించామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు. ఆయిల్ పామ్ సాగులో ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపి, GVAను రూ.1.52 లక్షల కోట్లకు చేర్చామని వెల్లడించారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఇంకా అబద్ధాలతో రైతులను మోసం చేయాలని చూస్తే ప్రజలే వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిల్లర్ పార్టీ దారుణాలకు తెగబడుతోంది.. సీఎం వార్నింగ్

బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 25 , 2026 | 07:29 PM