Kishan Reddy: భారత సైనికులకు మద్దతుగా కిషన్‌రెడ్డి కీలక పిలుపు
ABN , Publish Date - May 10 , 2025 | 01:25 PM
Kishan Reddy: దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్: పాకిస్తాన్ చేసిన అరాచకాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) గట్టిగా సమాధానం చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా భారత ఆర్మీ జవాబు చెప్పారని అన్నారు. భారత సైనికులు ధైర్యంతో, సాహసంతో వీరోచితంగా పాకిస్తాన్‌లోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాదుల ఇండ్లను మట్టుబెట్టారని చెప్పారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా భారత సైన్యం వీరోచితంగా పోరాటం చేస్తోందని అన్నారు. భారతదేశం మీద జరిగిన ఉగ్రవాదుల దాడికి గానూ పాకిస్తాన్ క్షమాపణ చెప్పాల్సింది పోయి.. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో, పౌర నివాసాలపై, సైనికులకు సంబంధించిన కేంద్రాలపై దాడులు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదుల నిర్మూలన లక్ష్యంగా పోరాటం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని ఇవాళ(శనివారం) బషీర్‌బాగ్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భారతదేశానికి మద్దతుగా భక్తులు నినాదలు చేశారు. జై శ్రీ రామ్.. జై రామ్ లక్ష్మణ్ జానకి.. జై బోలో హనుమాన్‌కి.. జై భవానీ.. జై శివాజీ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. దేశ భద్రత కోసం పోరాడుతున్న యోధుల రక్షణకు అమ్మవారి ఆశీర్వాదం కలగాలని కిషన్‌రెడ్డి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పహల్గామ్‌లో అమాయకులైన 26 మంది భారత పౌరులను పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్చిచంపారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలని పాకిస్తాన్ కుయుక్తులు పన్నుతోందని ధ్వజమెత్తారు. మన దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీయాలని, దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. గతంలో భారత సైనికులు, పౌరులను కిరాతకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు హత్యచేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కూడా లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయ పరిసరాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు జరిపి చాలామందిని పొట్టనబెట్టుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మన దేశ అమాయకులైన ప్రజలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా అందరూ ఏకమై ముక్తకంఠంతో పాకిస్తాన్ దుశ్చర్యలను ఖండిస్తున్నారని చెప్పారు. భారత సైనికులకు అండగా నిలబడ్డారని తెలిపారు. దేశ భద్రత కోసం పోరాటం చేస్తున్న భారత సైనికులకు మద్దతుగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లాలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక ర్యాలీలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత సైనికులకు మరింత ఆత్మస్థైర్యం కల్పించేలా ప్రజలు సంఘీభావాన్ని తెలియజేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: మావోల వేటకు విరామం.. బార్డర్‌కు బలగాలు
Harish Support To Soldiers: ఓపికకు హద్దు ఉంటుంది.. ఇక సహించం
Young Doctor Drug Case: డీజేతో పరిచయం... కొకైన్‌కు బానిస.. యువవైద్యురాలి కథ ఇదీ
Bhatti Vikramarka: యుద్ధ వాతావరణం.. సమగ్ర ప్రణాళిక అవసరం