KTR Fires ON Revanth Reddy: కాంగ్రెస్‌కి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:29 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గరీబోళ్ల ఇళ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి.. ఆ ఇళ్లని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కూలగొట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubilee Hills Bye Election) ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ప్రజలకి కారు కావాలో.. బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని చెప్పారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(ఆదివారం) కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో పలువురు నేతలు చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మాజీ మంత్రి కేటీఆర్.
గుణపాఠం చెప్పాలి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌లో ఖర్చుపెడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.10,000 ఇస్తారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకి పనికిరాని పార్టీ అని ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్.
కేసీఆర్ తిరిగి రావాల్సిందే..
‘హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందే. అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందే. కాంగ్రెస్ చేసిన మోసంపై ప్రజలు కోపంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు రూ.4 వేల పెన్షన్లు వస్తాయి. ఆ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు అమలు అవుతాయి. ఆరు గ్యారెంటీలని అమలు చేస్తామని చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. అన్ని అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఈ రెండు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయలేకపోయింది. ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదు, కానీ రూ.2,30,000 కోట్ల అప్పులని మాత్రం రేవంత్‌రెడ్డి చేశారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ల ఇండ్లపైకి బుల్డోజర్లను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పంపిస్తోంది. అన్నీ తెలిసినా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్‌రెడ్డి మోసం చేశారు. పార్లమెంట్‌లో చేయాల్సిన చట్టాన్ని.. రాష్ట్ర అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని తెలిసి మరీ బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్‌రెడ్డి నాటకాలు ఆడి మోసం చేశారు’ అని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
అజారుద్దీన్‌ని కూడా మోసం చేస్తారు..
‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అజారుద్దీన్‌కి సీటు ఇస్తామని చెప్పి చివరికి ఎమ్మెల్సీ సీటు అంటున్నారు. ఆ ఎమ్మెల్సీ కూడా ఆయనకు రాదని తెలుసు. అజారుద్దీన్‌ని కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మోసం చేస్తారు. ముస్లింలకు ఇస్తామని చెప్పిన శ్మశాన స్థలం విషయంలోనూ రేవంత్‌రెడ్డి మోసం చేశారు. తెలిసి మరీ ప్రజలను మోసం చేయడమే రేవంత్‌రెడ్డి నైజం. ఆయన నిజాయితీగా చెబుతూ మరీ మోసం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి గతంలోనే చెప్పారు.. మోసం చేసే వాళ్లనే ప్రజలు నమ్ముతారని. రెండు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయలేదు. ఆయన రెండు సంవత్సరాల్లోనూ కేసీఆర్ నామ జపం చేసి కాలం గడిపేశారు’ అని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ
నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
Read Latest Telangana News and National News