Share News

CPI Narayana: మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:34 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయనిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్‌లు ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శలు చేశారు.

CPI Narayana: మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్
CPI Narayana

హైదరాబాద్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మెగాస్టార్ చిరంజీవిపై (Megastar Chiranjeevi) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమని.. మాట్లాడే ముందు కామన్ సెన్స్‌తో చిరంజీవి మాట్లాడాలని హితవు పలికారు. గతంలో చిరంజీవి మీద తాను మాట్లాడిన మాటలను అప్పుడే వెనక్కు తీసుకున్నానని.. కానీ ఇప్పుడు ఆ వీడియోలను వైరల్ చేస్తూ.. తనను బద్నాం చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు సీపీఐ అగ్రనేత నారాయణ.


ఏపీ, తెలంగాణలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు..

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో సీపీఐ అగ్రనేత నారాయణ ఇవాళ(గురువారం) మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్‌లు ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని విమర్శలు చేశారు. నీవు నేర్పిన విద్య నీరజాక్షరంబు అన్నట్లు.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినవే ఇప్పుడు రిపీట్ అవుతాయని గుర్తుచేశారు. ఏపీలో జగన్ చేసిన అక్రమాలు.. ఏపీలో ఇప్పుడు ప్రభుత్వం మారినా తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు సరైనవేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు సడన్‌గా బీసీల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని విమర్శించారు. కవిత అస్సలు ఏ పార్టీ నుంచి బీసీ జపం చేస్తుందో తెలియడం లేదని ఎద్దేవా చేశారు సీపీఐ అగ్రనేత నారాయణ.


కార్మికులు రోడ్డున పడ్డారు..

చిత్రసీమకు సేవ చేసే కార్మికులందరూ రోడ్డునపడ్డారని సీపీఐ అగ్రనేత నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే డైరెక్టర్, హీరో, హీరోయిన్ కాదని.. కార్మికులు పని చేస్తేనే వారికి పేరు వస్తుందని చెప్పుకొచ్చారు. హీరోలకు కోట్ల రూపాయలు..? కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వరా. ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వారి సోకులకు సొగసులు దిద్దే కార్మికులను విస్మరిస్తారా..? అని మండిపడ్డారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు. ? అని నిలదీశారు. హీరో, హీరోయిన్లను అందంగా చూయించే కార్మికులను పట్టించుకోరా..? అని ప్రశ్నించారు. సందేశాత్మకమైన సినిమాలకు విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ అగ్రనేత నారాయణ.


నలుగురు చేతుల్లో సినిమా ఇండస్ట్రీ..

పాన్ మసాల, మద్యం, జూదం, గుట్కాలు, నేర పూరితమైన సినిమాలకు విలువిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురు చేతుల్లో ఉందని విమర్శించారు. కార్మికులను విస్మరిస్తే కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్మికుల వైపున తాము నిలబడతామని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రొడ్యూసర్లతో మాట్లాడుతారు కానీ సినిమా కార్మికులను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు సీపీఐ అగ్రనేత నారాయణ.


సినిమా కార్మికుల సమస్యలపై సీఎం చొరవ చూపాలి..

బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వాలు కూడా వీధి రౌడీలు లాగా వ్యవహారిస్తున్నాయని సీపీఐ అగ్రనేత నారాయణ ధ్వజమెత్తారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే పద్ధతిని ప్రభుత్వాలు ప్రోత్సహించడం సరైనది కాదని హితవు పలికారు. విలాసవంతమైన సినిమాలు తీసి, నైతిక విలువలను పాడు చేస్తూ కోట్లు గడుస్తున్న ప్రొడ్యూసర్లు కార్మికులను విస్మరించడం తగదని చెప్పుకొచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో స్కిల్స్ ఉన్న వారు లేరని కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడటం సరైంది కాదని పేర్కొన్నారు. సినిమా కార్మికుల సమస్యలపై నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ చూపాలని సీపీఐ అగ్రనేత నారాయణ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్

తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్‌

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 01:00 PM