Share News

CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్‌

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:23 AM

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దరన్న అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్‌

  • జయశంకర్‌ వల్లే ఉద్యమం సజీవం

  • నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దరన్న అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ప్రజా యుద్ధనౌక గద్దర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో.. గద్దర్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబంలో పుట్టి ఇం జనీరింగ్‌ విద్యను అభ్యసించిన గద్దర్‌ ఉన్నత కొలువుల వైపు దృష్టిసారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారని కొనియాడారు. పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్‌ అని గుర్తు చేశారు. గద్దర్‌ సాంస్కృతిక, సాహితీ సేవలకు గుర్తింపుగా జూన్‌ 14న గద్దర్‌ పేరిట తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులను సినీ కళాకారులకు, సినీ ప్రముఖులకు అందించామని తెలిపారు.


అలాగే.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ, ప్రజలు ఏవిధం గా నష్టపోయారో గణాంకాలతో ఎప్పటికప్పు డు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలపాటు సజీవంగా ఉంచిన ఘనత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌దేనని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు. బుధవారం జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. జయశంకర్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే శ్వాసగా, ధ్యాసగా, లక్ష్యంగా బతికారని, సకల జనుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. జయశంకర్‌ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 05:23 AM