Share News

ఏలూరు జిల్లాలో ఫ్లడ్ అలర్ట్.. ప్రజలకు అధికారుల హెచ్చరిక

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:36 PM

ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వరద హెచ్చరికలను జారీ చేశారు. పెదవాగు నుంచి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఏలూరు జిల్లాలో ఫ్లడ్ అలర్ట్.. ప్రజలకు అధికారుల హెచ్చరిక
Eluru District Flood Warning

ఏలూరు జిల్లా, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వరద హెచ్చరికలను జారీ చేశారు. పెదవాగు నుంచి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. వేలేరుపాడు మండల పరధిలోని ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో వచ్చే ఆకస్మిక వరదలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


ఏలూరు జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు

ఏలూరు జిల్లాలో ఏడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. కొయ్యలగూడెం నుంచి పోలవరం వెళ్లే రహదారిపై ప్రమాదకర స్థితిలో వరద పొటెత్తుతోంది. మూడు కిలోమీటర్ల మేరకు ఐదు అడుగుల ఎత్తులో రోడ్డును వరద ముంచెత్తింది. పోలవరం వైపు వెళ్లే ప్రధాన రహదారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్తున్న సిబ్బంది వరద ఉధృతికి తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొంటున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేశారు.


కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ రిజర్వాయర్‌కు భారీగా వరద

ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ రిజర్వాయర్‌కు భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్‌ఫ్లో 15,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో సున్నా క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం - 80.45 మీటర్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం (FRL) 83.50 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం - 4.428 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ - 2.134 టీఎంసీలుగా నమోదైంది. ఇంకా 2.294 టీఎంసీల బఫర్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లను ఎత్తాల్సిన అవసరం లేదని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు

స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 04:08 PM