Share News

రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:11 PM

రైతు భరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. తొలివిడత 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు.

రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

సిద్దిపేట, మార్చి22 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) విడుదల చేశారు. తొలివిడత 70 లక్షల మంది ఖాతాలకు రైతుభరోసా నిధులు రిలీజ్ చేశారు. ఎకరం వరకు ఉన్న రైతులకు రూ.3,600 కోట్లు విడుదల చేశారు. ఇవాళ ఆదివారం కావడంతో రైతుల ఖాతాల్లోకి రేపు(సోమవారం) నిధులు జమకానున్నాయి. మరో 20 రోజుల చొప్పున మిగతా రూ.5,400 కోట్లు జమకానున్నాయి. మరో 2 విడతల్లో రూ.2,700 కోట్లు చొప్పున రైతు భరోసా నిధులు జమకానున్నాయి. ఈరోజు(ఆదివారం) సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌‌రెడ్డి పర్యటించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. గతం కంటే రైతు భరోసా నిధులు పెంచామని స్పష్టం చేశారు.


రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం..

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. గతం కంటే రైతు భరోసా నిధులు పెంచామని తెలిపారు. పంటలకు మద్దతు ధరతో సహా రూ.500 బోనస్‌ ఇస్తున్నామని ఉద్ఘాటించారు. ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతినెలా రైతుల సంక్షేమం కోసం రూ.5,500 కోట్ల వ్యయం అవుతుందని చెప్పుకొచ్చారు. 20 నెలల్లో రైతుల కోసమే రూ.లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.


పంట సాగులో తెలంగాణ అగ్రస్థానంలో..

ప్రతి పంట సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. రూ.750 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించామని ప్రస్తావించారు. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ పండించినా కొంటామని తెలిపారు. కొడంగల్‌లోనూ పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామని వెల్లడించారు. రైతుల ఆదాయం పెరగాలంటే వరి ఒక్కటే మార్గం కాదన్నారు. రైతులు పంటల మార్పిడికి కృషి చేయాలని సూచించారు. పంటల మార్పిడికి రైతులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. పంటల మార్పిడితో రైతులకు మంచి ధర వచ్చేలా చూస్తామని భరోసా కల్పించారు. మిల్లెట్స్‌, ఆకు కూరలు, పామాయిల్‌ సాగుపై అన్నదాతలు దృష్టి పెట్టాలని సూచించారు. పామాయిల్‌ సాగుతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.ప్రతి పంచాయతీ అంకాపూర్‌లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెంచుకోవాలని సీఎం రేవంత్‌‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.


ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల వసతులు..

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు అదానీ, అంబానీ వంటివారు మాత్రమే సౌర విద్యుత్‌ వ్యాపారం చేసేవారని అన్నారు. తమ ప్రభుత్వం మహిళలతో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించిందని ప్రస్తావించారు. మహిళల పేరుతోనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. పిల్లలను ప్రైవేట్‌ బడుల్లో చదివించాలనే ఆలోచన చేయొద్దని అన్నారు. ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల వసతులు కల్పిస్తున్నామని ఉద్ఘాటించారు. విద్యార్థులకు పాలు, రాగి, జావ, పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 05:55 PM