కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన విధానాలతో రైతాంగం కష్టాల్లో ఉన్నారు: మంత్రి తుమ్మల
ABN , Publish Date - May 25 , 2026 | 01:05 PM
దేశంలో అన్నిరకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వరిధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.
ఖమ్మం జిల్లా, మే 25 (ఆంధ్రజ్యోతి): దేశంలో అన్నిరకాల పంటలను తమ ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. వరిధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ఇప్పుడు సిగ్గులేకుండా బీజేపీ నేతలు బస్సుయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కనీసం గన్నీ బ్యాగులు తీసుకురాలేని పరిస్దితి ఉందని అన్నారు. కేంద్రప్రభుత్వ దుర్మార్గమైన విధానాల కారణంగానే రైతాంగం కష్టాల్లో ఉన్నారని తెలిపారు. కనీసం డీజిల్ ఇవ్వకపోవటంతో ఎక్కడికక్కడా ధాన్యం రవాణా ఆగిపోయిందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. పలు సంస్థలను నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. ఇంకా కొంటామని స్పష్టం చేశారు. ఈరోజు (సోమవారం) యాతాలకుంట టన్నెల్‌ను మంత్రి పరిశీలించారు. యాతాలకుంట టన్నెల్ వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.
ఇది నా చిరకాల వాంఛ..
ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందాలనేది తన చిరకాల వాంఛ అని మంత్రి తుమ్మల ఉద్ఘాటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతం ఎక్కువ అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు గోదావరి ఆయకట్టు దక్కలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో చివరి ప్రాంతమైన ఖమ్మానికి గోదావరి జలాలు అందలేదని ప్రస్తావించారు. ఎక్కువ భూభాగం ఎన్నెస్పీ కెనాల్ పైభాగం.. కింద భాగంలో గోదావరి ఉండటంతో నీరు అందలేదని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి.. అప్పటి ముఖ్యమంత్రిని.. ఖమ్మానికి గోదావరి జలాలు అందించాలని కోరానని ప్రస్తావించారు. నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి మాజీ సీఎం ఎన్టీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అవకాశం ఇచ్చారని తెలిపారు. గోదావరిపై మొట్టమొదట దేవాదుల ప్రారంభించామని చెప్పుకొచ్చారు.
1998లో దుమ్మగూడెం ప్రతిపాదన తీసుకువచ్చాం..
గోదావరిపై ఎత్తిపోతల పథకాలకు తప్ప మరో అవకాశం లేదని మంత్రి తుమ్మల తెలిపారు. గోదావరిపై 1998లో దుమ్మగూడెం ప్రతిపాదన తీసుకువచ్చామని వివరించారు. ఆనాడు దుమ్ముగూడెం వద్ద రాజీవ్ సాగర్ - ఇందిరా సాగర్ వరకు ప్రారంభించిన పంపులు మోటార్లకే పరిమితమయ్యాయని అన్నారు. దుమ్ముగూడెం శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాతంలో సీతారామ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఆ ప్రభుత్వంలో కేవలం పంప్‌హౌస్ నిర్మాణ పనులకే పరిమితమయ్యాయని అన్నారు. యాతాలకుంట టన్నెల్ ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు నీరు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు.
లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి..
కేసీఆర్ హయాంలో ఈ టన్నెల్ పూర్తి చేయడానికి కూడా నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల అన్నారు. ఇది తన జీవిత ఆశయమని.. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పానని ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డి మొదటిసారి రాజీవ్ లింక్ కెనాల్‌కు అనుమతి ఇచ్చారని అన్నారు. ఆరునెలల్లో రాజీవ్ లింక్ కెనాల్ పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాతాలకుంట టన్నెల్‌కు అనుమతి ఇచ్చారని వెల్లడించారు. 15 నెలల్లో రెండు కిలోమీటర్ల పొడవు టన్నెల్ నిర్మాణం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
అధికారులను అభినందించిన మంత్రి తుమ్మల..
యాతాలకుంట టన్నెల్ పనులు చేపట్టిన ఏజెన్సీ, అధికారులను మంత్రి తుమ్మల అభినందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా గోదావరి జలాలతో సస్యశ్యామలం కాబోతోందని.. ఇది తన రాజకీయ కోరిక అని వ్యాఖ్యానించారు. తనను ఆశీర్వదించిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నదే తన ఆశయమని ఉద్ఘాటించారు. ఆగష్టు 15వ తేదీలోగా లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 35 సంవత్సరాల క్రితమే డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్ కట్టామని ప్రస్తావించారు. రైతుల త్యాగానికి ఫలితంగా నష్టపరిహారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించానని తెలిపారు. అటు సాగర్ ఆయకట్టు.. ఇటు సీతారామ ఆయకట్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కృష్ణా గోదావరి జలాలతో సస్యశ్యామలం కాబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్
వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..
Read Latest Telangana News And AP News And International News And Telugu News