Share News

ప్రక్షాళన దిశగా బీఆర్ఎస్..

ABN , Publish Date - Jul 24 , 2026 | 01:40 PM

పెద్దపల్లి జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయడం పై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టి సారించారు.

ప్రక్షాళన దిశగా బీఆర్ఎస్..
BRS Party, Karimnagar, Telangana

  • రంగంలోకి దిగిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

  • మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు జిల్లా బాధ్యతలు

  • ప్రజల్లోకి దూకుడుగా వెళ్లేందుకు కార్యాచరణ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయడం పై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టి సారించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాన్ని సైతం ఆ పార్టీ కైవసం చేసుకున్నది. గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ వర్గీయులు గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ రామగుండం కార్పొరేషన్‌ సహ పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు హస్తగతం అయ్యాయి.


దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌లో కొంత ఆత్మస్థయిర్యం దెబ్బతినగా, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎల్‏నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు, ప్రజలు సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయని కారణంగానే ప్రజలు, రైతులు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారనే అంశంతో ఆ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళుతున్నారు.


అధికార కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌పై ఉన్న కోపంతోనే రెండున్న రేళ్లు గడుస్తున్నా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయడం లేదని, దీని పర్యావసానంగా ప్రజలు తాగు, సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కన్నెపల్లి పంప్‌హౌస్‌ సందర్శించడం, మాజీ మంత్రి హరీష్‌ రావు, అధికార పార్టీ నాయకులకు ధీటుగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ నిర్వహించడం, కౌంటర్లు ఇస్తున్నారు. అంతేగాకుండా ఎక్కడికక్కడే క్షేత్ర స్థాయిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు సైతం ఇదే అంశంపై ప్రెస్‌మీట్లు, వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడంతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌లో జోష్‌ పెరిగింది. కాళేశ్వరంతో పాటు రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనను పోస్టుమార్టమ్‌ చేసి, ప్రజా వ్యతిరేక అంశాలను గుర్తించి ప్రజల్లోకి తీసుకవెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుక రావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేదని గుర్తించిన కేటీఆర్‌ అంద రినీ కలిపేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో అంద రి నాయకులకు సమన్వయం చేసే బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలను అప్పగించారు.

పెద్దపల్లిలోనూ నేతల మధ్య సమన్వయానికి చర్యలు

పెద్దపల్లి నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డాక్టర్‌ చిరుమల్ల రాకేష్‌, ఈద శంకర్‌ రెడ్డి, గంట రాములు, దాసరి ఉషల మధ్య సమన్వయం కొరవడింది. ఇక్కడ కూడా ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారని పార్టీ గుర్తించింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, సుల్తానాబాద్‌ కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు కావచ్చని భావిస్తున్న సదరు నాయకులు వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌పై ఆశలు పెంచుకున్నారు. గత రెండేళ్లుగా ఇక్కడ పార్టీ ఆదేశాలు మినహా ప్రత్యే కించి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేదు.


ktr.jpgఇదే నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పరిపాటి వెంకట్రామ్‌ రెడ్డికి నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించడంతో ఇక్కడి నేతలు అందరు అలర్ట్‌ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, మట్టి దందాల అంశాలపై ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శించడం మొదలు పెట్టారు. కాళేశ్వరం అంశం గురించి కూడా దాసరి మనోహర్‌రెడ్డితో పాటు రాకేష్‌, ఈద శంకర్‌రెడ్డిలు వేర్వేరుగా ప్రెస్‌మీట్లు పెట్టి ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకవెళ్లారు. దాసరి ఉష, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అండదండలతో పలు కార్యక్రమాలు చేపడుతూనే, బీసీ నినాదంతో ముందుకు వెళుతున్నది.


దీంతో పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొనడంతో అందరినీ ఒక్క తాటిపైకి తీసుక రావాలని పార్టీ భావిస్తున్నది. మంథని నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ దూకుడుగా వ్యవహరిస్తు న్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై అధికార కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసి మూడు స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే ప్లాన్‌తో బీఆర్‌ఎస్‌ ముందుకు వెళుతున్నది.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సైజులో రేషన్‌ కార్డు

కాజీపేట్‌-బలార్ష మార్గంలో మూడో లైన్‌ రెడీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 01:40 PM