విద్యార్థులను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు?.. డీయూపై రాహుల్ గాంధీ ఫైర్..
ABN , Publish Date - Jul 24 , 2026 | 01:06 PM
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) జారీ చేసిన అడ్వైజరీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగిస్తున్న విద్యార్థులను బెదిరించడం అంగీకారయోగ్యం కాదని ఆయన మండిపడ్డారు.
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న సీజేపీ నిరసనలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) జారీ చేసిన అడ్వైజరీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగిస్తున్న విద్యార్థులను బెదిరించడం అంగీకారయోగ్యం కాదని మండిపడ్డారు. విద్యార్థుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్న వారే భవిష్యత్తులో జవాబుదారీగా నిలవాల్సి వస్తుందని రాహుల్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రజాస్వామ్య హక్కులను వినియోగిస్తున్న విద్యార్థులను బెదిరించే హక్కు మీకెవరిచ్చారంటూ ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు దీనికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని డీయూను ఎంపీ రాహుల్ గాంధీ హెచ్చరించారు.
కాగా, నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులకు భద్రతా సూచనలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జంతర్‌మంతర్‌లో నిరసనలు కఠిన నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. చట్టవిరుద్ధంగా నిర్వహించే సభలు, ఆందోళనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించింది. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల వ్యక్తిగత భద్రతకు ముప్పు ఏర్పడటంతో పాటు విద్యాభ్యాసం, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల విద్యార్థులు జంతర్‌మంతర్ వద్ద జరిగే ఆందోళనలకు దూరంగా ఉండి, తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
సోషల్ మీడియాలో తప్పుడు, తప్పుదోవ పట్టించే సమాచారం విస్తృతంగా ప్రచారం అవుతోందని డీయూ పేర్కొంది. ఎలాంటి సమాచారాన్నైనా విశ్వసించి, ఇతరులతో పంచుకునే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని విద్యార్థులకు సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఒకే యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు..
నేపాల్ సరిహద్దులో చొరబాటుకు యత్నం.. నిషేధిత సంస్థ సభ్యుల అరెస్ట్..