Share News

ఒకే యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు..

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:29 PM

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే యువకుడిని వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో ఒకరినొకరు విడిచి ఉండలేమని భావించిన యువతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఒకే యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు..
Three Sisters Marriage

ఉత్తర్ ప్రదేశ్: ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే యువకుడిని వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో ఒకరినొకరు విడిచి ఉండలేమని భావించిన యువతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు యువతులు ప్రతి రోజు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటారు. వారికి వీడియోలు తీసే కెమెరామెన్‌నే పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


అమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లోని ధతురియా గ్రామానికి చెందిన సరోజ్ (20), సావిత్రి రాణి (19) అక్కాచెల్లెళ్లు. వారికి సోదరి వరసయ్యే సంతోష్ ఖడక్‌వన్షీ(18) ఉంది. వీరంతా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. కొన్నాళ్లుగా ముగ్గురు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో వీడియోలు చేయడం ప్రారంభించారు. వివిధ రకాల కంటెంట్‌తో వీడియోలు చేసి పలువురు సబ్‌స్ర్కైబర్లను కూడా సంపాదించారు. వీరికి శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ ఖడక్‌వంశీ అలియాస్ విక్కీ (20) గత ఆరు నెలలుగా కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. అలాగే వారి వీడియోల్లో యువతులకు పలుమార్లు భర్త పాత్ర కూడా పోషించాడు.


అయితే, ఇటీవల అక్కాచెల్లెళ్లకు విడివిడిగా పెళ్లి చేయాలని ఇంటి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధాలు చూడటం కూడా మొదలుపెట్టారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో ఒకరినొకరు విడిచి ఉండలేమని అక్కాచెల్లెళ్లు భావించారు. తామంతా విడిపోయి జీవించాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురూ కలిసి తమ కెమెరామెన్ విక్కీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విషయాన్ని యువకుడికి చెప్పి ఒప్పించారు. స్థానిక చాముండి మాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను వారంతా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. అయితే, ఈ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టు న్యాయవాది అనురాగ్ పాండే స్పందించారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటానికి అనుమతి లేదని తెలిపారు. ఒకవేళ ఎక్కువ మందిని చేసుకుంటే అలాంటి వివాహాలు చట్టప్రకారం చెల్లవని పేర్కొన్నారు. మరోవైపు, ఘటనపై హసన్‌పూర్ సర్కిల్ అధికారి పంకజ్ త్యాగి మాట్లాడారు. విషయం తమ దృష్టికి వచ్చిందని.. విచారణ కూడా జరిపామన్నారు. అయితే, తాము మేజర్లమని, తమ ఇష్టం, స్వేచ్ఛతోనే వివాహం చేసుకున్నట్లు ముగ్గురు యువతులు తెలిపారని చెప్పారు. ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, వారి తల్లిదండ్రులు కూడా పెళ్లికి అభ్యంతరం చెప్పలేదన్నారు. అధికారిక ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

క్వశ్చన్ పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై ఇక కఠిన చర్యలు.. నేటి కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు!

ఫ్లాట్‌లో యజమానికి పట్టపగలే చుక్కలు.. వీడియో వైరల్

Updated Date - Jul 24 , 2026 | 12:44 PM