Share News

ఫ్లాట్‌లో యజమానికి పట్టపగలే చుక్కలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:52 PM

దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై వంటి మహానగరాల్లో సొంత ఇల్లు ఉంటే కోటీశ్వరుడి కిందే లెక్క. ఈ నగరాల్లో ఇళ్ల ధరలు అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో ఉంటాయి.

ఫ్లాట్‌లో యజమానికి పట్టపగలే చుక్కలు.. వీడియో వైరల్
Water-in-apartment.j

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబై వంటి మహానగరాల్లో సొంత ఇల్లు ఉంటే కోటీశ్వరుడి కిందే లెక్క. ఈ నగరాల్లో ఇళ్ల ధరలు అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వాటి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అలా కోట్ల రూపాయలు వెచ్చించి.. ఇల్లు కొనుగోలు చేశాడో వ్యక్తి. కానీ ఆ సంతోషం అంతలోనే ఆవిరైపోయింది.


న్యూఢిల్లీలో ఓ వ్యక్తి రూ.1.5 నుంచి రూ.2 కోట్లు వెచ్చించి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. సొంత ఇంటి కల నెరవేరిందని ఆనందపడ్డాడు. అయితే అతడికి ఆ ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. తన ఫ్లాట్‌లోని హాల్‌లో పైకప్పు నుంచి నీరు పెద్ద ధారగా కారుతోంది. ఆ నీటితో హాల్ మొత్తం నిండిపోతుంది. హాల్‌లోని వస్తువులన్నీ తడిసిపోయాయి. ఇది చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.


ఈ వైరల్ వీడియోను @SanjuGoyel అనే యూజర్ ఎక్స్‌‌లో షేర్ చేశారు. ఢిల్లీలోని ఓ హౌసింగ్ సొసైటీలో 13వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ఈ సంఘటన జరిగింది. పైపు పగిలిపోయి.. నీళ్లు ఇలా బయటికి వచ్చాయని తెలిసింది. పైపును సరిగ్గా అమర్చకపోవడం, స్లాబు సమయంలో నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది.


ఈ ఘటనతో కలత చెందిన ఫ్లాట్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అపార్ట్‌మెంట్ నిర్మించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన నిర్మాణంలో నాసిరకం సామగ్రిని ఉపయోగించారని ఆ ఎఫ్ఐఆర్‌లో స్పష్టం చేశాడు. నిర్వహణ ఖర్చులను ఏజెన్సీ నుంచి తిరిగి చెల్లించాలని ఫ్లాట్ యజమాని డిమాండ్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఉంటే ఈ తరహా ఘటనలే జరుగుతాయని వారు చెబుతున్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు.. కేవలం ప్రదేశం, ధర మాత్రమే కాకుండా.. నిర్మాణ నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొనుగోలుదారులకు నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jul 23 , 2026 | 04:37 PM