క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో రేషన్ కార్డు
ABN , Publish Date - Jul 24 , 2026 | 08:36 AM
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు చిన్నపాటి పుస్తకంపై ఉన్న నంబర్ ఆధారంగానే సరుకులు పంపిణీ చేస్తున్నారు.
ఈ-పాస్ యంత్రంపై స్కాన్ చేస్తే వివరాలు ప్రత్యక్షం
త్వరలో అందుబాటులోకి
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు చిన్నపాటి పుస్తకంపై ఉన్న నంబర్ ఆధారంగానే సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు వారు తమ ఇంటి సమీపంలోని దుకాణాలకు వెళ్లి కార్డు నంబర్ చెప్పిన తర్వాత బయోమెట్రిక్‌పై వేలిముద్రలు తీసుకుని కుటుంబంలో ఉన్న లబ్ధిదారులందరికీ కలిపి కోటాను అందజేస్తున్నారు. ఈ తరుణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా త్వరలో స్మార్ట్‌కార్డు సైజులో రేషన్‌కార్డులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది.
క్రెడిట్ కార్డు మాదిరిగా..
తెలంగాణ పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో కొత్తగా అందించనున్న రేషన్‌కార్డు.. బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కార్డుపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నారని, లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లి డీలర్‌కు కార్డు అందించిన తర్వాత ఈ-పాస్ యంత్రంపై దానిని స్కాన్ చేస్తే వివరాలు ప్రత్యక్షమవుతాయని తెలిపారు. కార్డును స్కాన్ చేసిన తర్వాత అందులో లబ్ధిదారుల వివరాలతోపాటు ఇప్పటివరకు తీసుకున్న బియ్యం, సరుకులు, ప్రస్తుతం తీసుకోవాల్సిన వివరాలన్నీ కనిపిస్తాయని చెప్పారు.
కార్డు ఏ మాత్రం చిరిగిపోకుండా, నీటిలో తడిచినా పాడవకుండా ఉండే విధంగా రూపొందిస్తున్నారన్నారు. వాస్తవంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు సరైన కార్డులు లేకపోవడంతో మీసేవా ద్వారా పొందిన పేపర్‌ను మాత్రమే తీసుకుని దుకాణాలకు వెళ్లి అందులో ఉన్న నంబరును ఈ-పాస్ యంత్రంపై నమోదు చేసుకుని బియ్యం పొందుతున్నారని, పేపర్ చిరిగిపోవడంతోపాటు పలు సందర్భాల్లో నంబరు కనిపించక డీలర్లు, నిరక్ష రాస్యులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో జేబు పాకెట్‌లో పెట్టుకునే విధంగా చిన్న సైజులో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్‌కార్డును అందించేందుకు పౌర సరఫరాలశాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇదిలా ఉండగా, స్మార్ట్‌కార్డుపై కుటుంబ యజమాని పేరు, చిరునామా ఉండడంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి ఫొటో ఉండనుందని తెలుస్తోంది. వచ్చేనెలలో కొత్త కార్డుల పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News