ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:10 PM
భారత దివంగత మాజీ ప్రధాని, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ దేశం కోసం అనునిత్యం శ్రమించారని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్: భారత దివంగత మాజీ ప్రధాని, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ దేశం కోసం అనునిత్యం శ్రమించారని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు, మాజీ మంత్రులు దానం నాగేందర్, గీతారెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరాగాంధీ నిరంతరం కృషి చేశారు..
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడారు. దేశాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇందిరా గాంధీ నిరంతరం కృషి చేశారని కీర్తించారు. గుడిసెలు లేని గ్రామాలు ఉండాలనే సంకల్పంతో పేదల అభ్యున్నతికి విశేష ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. 'గరీబీ హటావో' నినాదం పేదరిక నిర్మూలనపై ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశం కోసం అనునిత్యం శ్రమించిన ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగించడమే మనం ఇచ్చే నివాళి అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. సోనియా గాంధీ రచించిన పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, అందులోని విషయాల ద్వారా ఇందిరా గాంధీ జీవితం, దేశం కోసం ఆమె చేసిన సేవలను మరింతగా తెలుసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News