Share News

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు

ABN , Publish Date - Jul 05 , 2026 | 03:09 PM

పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు.

కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Telangana Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, జులై 5 (ఆంధ్రజ్యోతి): పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు ఏది ముట్టుకుంటే అది నాశనమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వ్యాఖ్యానించారు. ఈరోజు(ఆదివారం) కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అధిక శాతం లోన్లు తీసుకొచ్చి బీఆర్ఎస్ నాయకుల లాభం కోసం కాళేశ్వరం కట్టారు తప్ప.. తెలంగాణ ప్రజల కోసం కాదని చెప్పుకొచ్చారు.


ఇరిగేషన్ శాఖను చక్కదిద్దాం..

రూ.1.81లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఆ ప్రాజెక్టులు అన్ని అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు. తాము అధికారంలో వచ్చాక ఇరిగేషన్ శాఖను చక్కదిద్దామని వివరించారు. ఉల్టా చోర్ కొత్వాల్‌కు దండే అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ హయాంలోనే.. కూలిపోయింది వాళ్ల హయాంలోనే అని ఇంజినీర్లు రిపోర్ట్ ఇచ్చారని ప్రస్తావించారు. కన్నెపల్లి పంపు దగ్గరకు పోయి ప్రాణహిత పంపు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ నాటకాలు ఆడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా కడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వల్లే కాళేశ్వరం నీళ్లు ఉపయోగించలేకపోతున్నామని అన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉంది..

నాసిరక నిర్మాణం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఉపయోగించలేకపోతున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫౌండేషన్ తప్పుగా ఉందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ఇలానే కొనసాగిస్తే ప్రమాదమని అంతర్జాతీయ, జాతీయ నీటి నిపుణులు నివేదిక ఇచ్చారని అన్నారు. కేటీఆర్ కన్నా ఎన్డీఎస్‌ఏ అధికారులకు నాలెడ్జ్ ఎక్కువగా ఉందని తాను అనుకుంటున్నానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ చేసినప్పుడు కూలిపోతే కింద ఉన్న 40 ఊర్లు, భద్రాచలం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టకుండా తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. లేకపోతే ఎప్పుడో ఉత్తర తెలంగాణ సస్యశామలం అయ్యేదని వివరించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది గులాబీ పార్టీనే అని ఆగ్రహించారు. కాంగ్రెస్‌కి మంచి పేరు వస్తుందనే కారణంతో తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకి డిజైన్ మార్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజల ప్రేమే నా బలం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 03:28 PM