కేసీఆర్.. మాక్ అసెంబ్లీకి కూడా రాలేదంటే చట్టసభలపై నమ్మకం లేదా.?: మంత్రి సీతక్క
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:14 PM
బీఆర్ఎస్‌పై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నిర్వహించింది మాక్ అసెంబ్లీ కాదని.. డెమోక్రసీని గులాబీ పార్టీ ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్‌పై (BRS) తెలంగాణ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నిర్వహించింది మాక్ అసెంబ్లీ కాదని.. డెమోక్రసీని గులాబీ పార్టీ ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. ఈరోజు (శనివారం) అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి సీతక్క చిట్‌చాట్ చేశారు. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ నిర్వహించి, ఆ పార్టీ ఆఫీస్‌లో మాక్ అసెంబ్లీని ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. ఫౌంహౌస్ ముందు దళిత సంఘాలు నిరసన తెలిపితే గులాబీ పార్టీ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారని ఆగ్రహించారు.
బీఆర్ఎస్‌ది ఆధిపత్య దురంహంకారం..
ఇంకా ఆ మైలపోలేదనే ఆధిపత్య దురంహంకారంతో ఆ పార్టీ నేతలు ఫౌంహౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించలేదా? అని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి ఎలాగూ రాని కేసీఆర్... మాక్ అసెంబ్లీకి కూడా రాలేదంటే ఆయనకు చట్టసభలపై ,సొంత పార్టీ కార్యక్రమంపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. అధికారంలో ఉంటే సచివాలయానికి రారని.. ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి కూడా రారా అని నిలదీశారు. ఫాంహౌస్‌ని సచివాలయంగా.. పార్టీ కార్యాలయాన్ని అసెంబ్లీగా భావించే పార్టీ బీఆర్ఎస్ తప్ప దేశంలో మరొకటి లేదని ఎద్దేవా చేశారు.
స్పీకర్‌ను, చట్టసభలను అవమానిస్తున్నారు..
ఫౌంహౌస్‌లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్, పార్టీ ఆఫీస్‌లో అసెంబ్లీ మీటింగ్ పెట్టడమంటే వారు ఉన్న దగ్గరకే అన్ని రావాలనుకోవడం దొరల అహాంకారానికి నిదర్శనమని మంత్రి మండిపడ్డారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా అధికారం పోయినా.. దొర అహంకారం ఇంకా పోలేదని ఎద్దేవా చేశారు. స్పీకర్‌ను, చట్ట సభలను అవమానిస్తున్న బీఆర్ఎస్‌ను ప్రజలు శిక్షించడం ఖాయమని మంత్రి సీతక్క హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేత్రపర్వంగా ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్
చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News