Share News

ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం

ABN , Publish Date - Oct 12 , 2026 | 01:02 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్ర సర్‌ (ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ) ఎక్కడ తీసేశారో అక్కడ బీజేపీ గెలుస్తోందని ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం
Telangana CM Revanth Reddy

ఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, బిహార్, మహారాష్ట్రలో సర్‌ (ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ) ఎక్కడ తీసేశారో అక్కడ బీజేపీ గెలుస్తోందని ధ్వజమెత్తారు. మతాలు, ప్రాంతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని దుయ్యబట్టారు. మనుగడ లేని రాష్ట్రాల్లో ఇతర పార్టీలు గెలుస్తున్నాయని వెల్లడించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. సీఈసీ ఎంపికలో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని తొలగించారని ప్రస్తావించారు. ఈరోజు (సోమవారం) ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.


జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతున్నాయి..?

2014లో 81 కోట్ల ఓట్లు వచ్చాయని.. 2019లో 91 కోట్ల ఓట్లు, 2023లో 97 కోట్ల ఓట్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారని, ఇప్పుడు ఉన్న జనాభా ఎంత అని ప్రశ్నించారు. జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతున్నాయి..? అని నిలదీశారు. ఈ విషయంలో ఎవరు సమాధానం చెబుతారని అడిగారు. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు కూడా మోదీకి ఈ విషయం గురించి ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీ రెండు వర్గాలను తయారు చేస్తోందని.. అనుకూలం ఉన్న వారికి ఓట్లు, ఇతరులను ఓట్లులేని వారిగా తయారు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలోని పౌరులను మోదీ సర్కార్ రెండు రకాలుగా విడగొడుతోందని మండిపడ్డారు. ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.


దేశంలో శాశ్వత విభజనను బీజేపీ తీసుకొస్తోంది..

దేశంలో శాశ్వత విభజనను బీజేపీ తీసుకొస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. సీఈసీపై మరో స్వతంత్ర పోరాటం జరుగుతోందని వెల్లడించారు. జ్ఞానేశ్ గో బ్యాక్ పేరుతో తమ ఆందోళన కొనసాగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సర్ వ్యతిరేక పోరాటం, మరో స్వతంత్ర పోరాటమేనని.. సైమన్ గో బ్యాక్ పోరాటం లాగే తాము పోరాటం చేస్తామని అన్నారు. ఇన్నాళ్లు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను ఉపయోగించి ప్రత్యర్థులను అణిచివేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదనే అభిప్రాయంతో ‘సర్’ను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమకు ఓటు వేయని వారి ఓట్లను ‘సర్’ పేరుతో తొలగిస్తున్నారని ఆగ్రహించారు.


ఏఐను ఉపయోగించి బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారు..

ఏఐను ఉపయోగించి బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న యువత ఓట్లను కూడా తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ ఎందుకు జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓట్లను తొలగించి పశ్చిమబెంగాల్, బిహార్, హరియానాలో గెలిచారని ధ్వజమెత్తారు. ఓటు లేకపోతే ఏ పార్టీ పేదలను పట్టించుకోదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సిబ్బందికి ప్రమాదం

యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 02:27 PM