హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:00 PM
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) సూచించారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని సీఎం స్పష్టం చేశారు.
ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం..
ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ(శుక్రవారం) పాల్గొని ప్రసంగించారు. మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో ప్రస్తావించారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని అభివర్ణించారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని పేర్కొన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానసిక మేథస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని వివరించారు.
భారత్ అలాంటి తప్పిదం చేయొద్దు..
ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని.. కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్..
ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని పేర్కొన్నారు. అయితే సరైన రీస్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించబడే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ - ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలి..
స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
భారత్ నాయకత్వం వహించాలి..
సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా.. ఏఐ అభివృద్ధి ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు
మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
Read Latest Telangana News And AP News And Telugu News