మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:23 PM
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రులు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై రెండు గంటల పాటు ఖర్గే సమీక్ష జరిపారు..
ఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Malli Karjuna Kharge) నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై రెండు గంటల పాటు ఖర్గే సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో.. మెజారిటీ అమలు చేశామన్నారు. తమ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని చెప్పారు. హామీలన్నీ అమలు చేసి శభాష్ అనిపించుకుని, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్లు అప్పుపెట్టారని ఆరోపించారు. ఉన్న నిధుల్లో తమ ప్రభుత్వం పథకాలన్నింటినీ చాకచక్యంగా అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు.
నామినేటెడ్ పదవుల భర్తీ..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రివర్గాన్ని కాంగ్రెస్ హై కమాండ్ అభినందించిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 80 శాతం ప్రజలు సంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాలను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని వివరించారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థాయిలో ఉందని.. మిగతా పంటలను ప్రోత్సహించాలని ఖర్గే చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపై ఖర్గే సూచనలు చేశారని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ భేటీ జరిగిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలను పెద్దలు విన్నారన్నారు. అన్ని అంశాలపై తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
అన్ని హామీలను అమలు చేస్తాం..
మార్చి 15వ తేదీ కల్లా పార్టీ పదవులను భర్తీ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. అన్ని గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. రాజ్యసభ ఎన్నికలపై రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని, తనని పిలిచి మాట్లాడతామని ఖర్గే అన్నారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వచ్చిందని, ఈ విషయంపై అధిష్టానం పెద్దలు త్వరలోనే ఆయన్ను పిలిచి మాట్లాడతామని అన్నారని చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 80శాతం మంది ప్రజలు కాంగ్రెస్‌ని ఆశీర్వదించారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాజకీయంగా, ప్రభుత్వ పరంగా అన్ని అంశాలనూ రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..
Read Latest Telangana News And AP News And Telugu News