మా అక్కలు పెట్టిన వాతలతోనే కొందరు ఫామ్‌హౌస్‌లో..: సీఎం
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:06 PM
మహిళా శక్తి పథకం కింద 553 బస్సులు పంపిణీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మహిళా శక్తి పథకం కింద 553 బస్సులు పంపిణీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బస్సులను సీఎం ప్రారంభించి ప్రసంగించారు. మహిళా సాధికారతకు తమ సర్కార్ మరో కీలక అడుగు వేసిందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం.. మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేస్తున్నామని ఉద్ఘాటించారు.
తొలి మహిళా రాష్ట్రపతిని అందించింది కాంగ్రెస్సే..
దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించింది కాంగ్రెస్సేనని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఒక్కసారైనా మహిళకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలను స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నామని వివరించారు. మహిళలను పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోని తొలి ఐదేళ్లలో ఒక్క మహిళకైనా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని ప్రస్తావించారు. మహిళలను స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నామని వివరించారు.
మహిళలను పరిపాలనలో భాగస్వామ్యం చేస్తాం..
మహిళలను పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారని తెలిపారు. ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. తమ అక్కలు పెట్టిన వాతలతోనే కొందరు ఫామ్‌హౌస్‌లో పండుకున్నారని విమర్శించారు. ఉచిత బస్సుతో స్కూళ్లలో ఆడపిల్లల డ్రాపౌట్స్ తగ్గాయని అన్నారు. ఉచిత బస్సు పథకం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కడుపు నిండా విషం పెట్టుకుని ఉచిత బస్సు పథకం ఆపాలని కొంతమంది చూశారని ధ్వజమెత్తారు.
ఆటోడ్రైవర్లను రెచ్చగొట్టారు..
ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి రోడ్డుపైకి పంపారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహించారు. 27 వేల స్కూళ్ల నిర్వహణ బాధ్యత కూడా ఆడబిడ్డలకు అప్పగించామని తెలిపారు. మిడ్ డే మీల్ పథకం సరుకులు కూడా మహిళలే సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. పెట్రోల్ బంకుల నిర్వహణ అప్పగించడంతో లక్షలు సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. 8 వేల స్త్రీ శక్తి భవనాలు ఒకేసారి పూర్తిచేస్తామని అన్నారు. కార్పొరేట్ ఆఫీస్‌ల కంటే మిన్నగా స్త్రీ శక్తి భవనాలు ఉంటాయని వివరించారు. హైటెక్ సిటీ దగ్గర మహిళలకు రూ.1000 కోట్ల భూమి కేటాయించామని ప్రస్తావించారు. 106 స్టాల్స్‌తో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో మాల్ నిర్మించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి..
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దళారులు, దోపిడీదారులకు తమ ప్రభుత్వంలో చోటులేదని స్పష్టం చేశారు. 2034 వరకు ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు అండగా ఉండే బాధ్యత తమదని తెలిపారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా మహిళా సంఘాలను ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు. రూ.60 వేల కోట్ల రుణాలతో ఆర్థికంగా నిలబెడుతున్నామని తెలిపారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని మంచి చీరలు ఇస్తున్నామని వివరించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన చీరలను ఎవరైనా కట్టుకున్నారా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల సంక్షేమానికి అన్నివేళలా కృషిచేస్తామని తెలిపారు. పంట మార్పిడి విషయంలో మహిళలు చొరవ చూపాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News