Share News

సీఎం పాత్ర పోషిస్తా.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:07 PM

మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసింది తానేనని, సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.

సీఎం పాత్ర పోషిస్తా.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Malla Reddy

హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకున్న సంబంధం గురించి, సినిమాల్లో తన నటనాభిలాష గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి సినిమా వేషాల వరకు మల్లారెడ్డి ఎప్పుడూ తన మాట తీరుతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈరోజు అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ మల్లారెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు.


రేవంత్‌రెడ్డిని సీఎం చేసింది నేనే..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్‌రెడ్డి మినహా మరో పవర్‌ఫుల్ నాయకుడు లేరని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. గతంలో జరిగిన రెడ్డి సంఘం సమావేశంలో రేవంత్ ఒక్కరే గట్టి నాయకుడని తాను నొక్కి చెప్పినట్లు ప్రస్తావించారు. ‘రాజకీయాలు ఎలా ఉన్నా.. ఎవరు అవునన్నా, కాదన్నా తాను, రేవంత్‌రెడ్డి అన్నదమ్ములమే’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.


ఉస్తాద్ భగత్ సింగ్‌లో విలన్ ఆఫర్..

సినిమాలపై తనకున్న మక్కువను మల్లారెడ్డి మరోసారి బయటపెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించి, ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీశ్‌శంకర్ తనను అడిగారని పేర్కొన్నారు. అయితే, ఆ విలన్ పాత్రకు తాను నో చెప్పానని ఆయన తెలిపారు.


సీఎం కావాలనే కోరిక

‘రియల్ లైఫ్‌లో కాకపోయినా, రీల్ లైఫ్ లోనైనా’ ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి తన మనసులో మాటను చెప్పారు. సినిమాల్లో తనకు ముఖ్యమంత్రి పాత్ర చేయాలని బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన

బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 23 , 2026 | 12:13 PM