Share News

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:42 PM

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అత్యంత సీనియర్, గౌరవప్రదమైన నాయకుడు. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కి వెన్నుముకగా ఉన్న ఆయన, ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన
Jeevan Reddy

జగిత్యాల, , మార్చి22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి (Jeevan Reddy) అత్యంత సీనియర్, గౌరవప్రదమైన నాయకుడు. గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కి వెన్నుముకగా ఉన్న ఆయన, ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారనే వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో జీవన్ రెడ్డి పార్టీ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కాంగ్రెస్‌లో నాకు గౌరవం లేదు.. ఇక ఈ క్షోభను భరించలేను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.


జీవన్‌రెడ్డి ఏమన్నారంటే..

ఈ నెల 25వ తేదీన తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నాలుగు దశాబ్దాలుగా తనతో నడిచిన కార్యకర్తలు, సన్నిహితులు సూచనలు ఇవ్వాలని అన్నారు. జగిత్యాలలోని బండారు గార్డెన్‌లో 25న తన ముఖ్య నేతలతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. పార్టీలో కొనసాగలేనని.. ఈ క్షోభ భరించలేనని అన్నారు. పార్టీలో తనకు గౌరవం లేదని తెలిపారు. తనకు అన్యాయం చేసిన వారిలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒకరని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి వల్ల తన గౌరవానికి భంగం కలిగిందన్నారు. తనకు రేవంత్ అంటే గౌరవం ఉన్నా.. తన సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర కూడా లేదని తెలిపారు. పదిమంది ఎమ్మెల్యేలను పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టగలరా..? అని ప్రశ్నించారు. మేడిగడ్డను రిపేర్ చేసే బాధ్యత లేదా..? అని నిలదీశారు. రైతాంగం సాగునీటికి ఇబ్బంది పడుతోందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.


జీవన్ రెడ్డి అసంతృప్తికి కారణాలివే..

నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడినా, ప్రస్తుతం పార్టీలో తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి (ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి) ఎమ్మెల్యే సంజయ్, ఇతర నేతల చేరికలు, వారికి పార్టీలో ప్రాధాన్యం పెరగడం జీవన్ రెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.


ముఖ్య నేతల సమావేశం..

తన రాజకీయ భవిష్యత్తును తేల్చుకోవడానికి ఈ నెల 25వ తేదీన జగిత్యాలలోని బండారు గార్డెన్‌లో తన అనుచరులు, ముఖ్య నేతలతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు కార్యకర్తల సూచనల మేరకు తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.‘నాలుగు దశాబ్దాలుగా నాతో నడిచిన కార్యకర్తలు, సన్నిహితులు సూచనలు ఇవ్వండి. మీ అభిప్రాయం మేరకే నా భవిష్యత్ నిర్ణయం ఉంటుంది’ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.


కాంగ్రెస్‌పై ప్రభావం..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేత పార్టీని వీడితే, అది కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బనేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్లను కాపాడుకోలేకపోతున్నారనే విమర్శలు కాంగ్రెస్ హైకమాండ్‌పై వచ్చే అవకాశం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.


ప్రత్యామ్నాయ దారి..

ఆయన స్వతంత్రంగా ఉంటారా లేక మరేదైనా పార్టీలో చేరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఆయన పార్టీ మారితే జగిత్యాల సమీకరణలు పూర్తిగా మారిపోనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత అలిగితే పార్టీ అధిష్ఠానం (ముఖ్యమంత్రి లేదా టీపీసీసీ అధ్యక్షుడు) వెంటనే రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 25వ తేదీ లోపు ఆయనను శాంతింపజేస్తారా లేక ఆయన తన దారి తాను చూసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

JEEVAN-REDDY.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 05:09 PM