పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్ నేతలకు మహేశ్ గౌడ్ సవాల్
ABN , Publish Date - Sep 06 , 2026 | 02:18 PM
నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. వెయ్యి రోజుల పాలనకు, పదేళ్ల పాలనకు తేడాపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. వెయ్యి రోజుల పాలనకు, పదేళ్ల పాలనకు తేడాపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. గులాబీ పార్టీ నేతలు ఎక్కడంటే అక్కడ చర్చ చేద్దామని ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఈరోజు (ఆదివారం) కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో మహేశ్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. నేడు తమ ప్రభుత్వం వెయ్యి రోజుల పండగ చేసుకుంటోందని పేర్కొన్నారు.
మాది ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం..
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత కీలకమని మహేశ్ గౌడ్ వెల్లడించారు. తమది ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణపై చేసిన అప్పును మోస్తూనే సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. తాము ఇస్తున్న సంక్షేమం ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ధనికులు తినే సన్నబియ్యాన్ని తాము పేదవారికి ఇస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల కోసం లక్షల్లో అప్లికేషన్లు వస్తే.. వేలల్లో కూడా కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
చదువు కంటే సంస్కారం ముఖ్యం..
కేటీఆర్ చదువుల విషయంలో వ్యంగంగా మాట్లాడుతున్నారని మహేశ్ గౌడ్ ధ్వజమెత్తారు. చదువు కంటే సంస్కారం ముఖ్యమని అన్నారు. చదువుకున్న కేటీఆర్ తెలంగాణకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. తమ సీఎం, ఐటీ మంత్రి కోట్లాది రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఉద్యమకారులకు గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. గద్దర్, అందెశ్రీలను గౌరవించామని తెలిపారు. ఫూలే విగ్రహాలను హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టామని వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని తాము ఏర్పాటు చేశామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కేంద్రంతో బీసీ కులగణన చేయిస్తాం..
‘కేంద్రాన్ని వణికిస్తాం. కేంద్రంతో బీసీ కులగణన చేయిస్తాం. బీజేపీ బీసీ నాయకులు ఏం చేస్తున్నారు?. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది. జీతం తీసుకుంటున్న కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. కొడుకు, అల్లుడు బయటకు రానివ్వడం లేదా?. ముఖ్యమంత్రి తర్వాత స్థానం ప్రతిపక్ష నేతదే. చేతకాకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలి. కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి పక్కకెళ్లినా పర్వాలేదు. రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుక్కో, అల్లుడికో బాధ్యత ఇవ్వండి. మేం అధికారంలోకి మళ్లీ మళ్లీ వస్తాం. తెలంగాణలో 2040 వరకు మేమే అధికారంలో ఉంటాం. బీజేపీ మొక్క రాష్ట్రంలో మొలవదు. బీఆర్ఎస్ అనే మొక్క ఇక్కడ వాడిపోయింది. నక్సల్స్‌కి నా మద్దతు ఇచ్చాను. నేను ఒకప్పుడు నక్సల్స్ బాధితుడిని’ అని మహేశ్ గౌడ్ తెలిపారు.
కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలి..
‘బీఆర్ఎస్ సోషల్ మీడియాతో కేటీఆర్ క్షణికానందం పొందవచ్చు. కేసీఆర్‌కి ఇచ్చిన హోదాను విస్మరించడం తప్పు. కేంద్రాన్ని విమర్శిస్తే దేశ ద్రోహి అంటారా?. కేసీఆర్‌కి గౌరవంతో చెబుతున్నాం. కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలి. మా తప్పులను వెలికి తీయండి. కేసీఆర్ బయటకు రారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడాలన్నది మా ధ్యేయం. మీనాక్షీ నటరాజన్ నిప్పు లాంటి మనిషి. నీతినిజాయితీ గల మనిషి మీనాక్షీ. ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తే దాన్ని దొంగలించారు. బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తామని కలలు గంటున్నాయి’ అని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి
చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు
గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News